
- భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: పొన్నం
- గుళ్లకు చెక్కుల పంపిణీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఆషాఢ మాసంలో నెలరోజులపాటు జరుపుకునే బోనాల పండుగకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ లో ఆషాఢ మాసం బోనాలు జాతర ఉత్సవాలు 2024 హైదరాబాద్ జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుపుకుంటున్న బోనాల ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా జరిగేలా చూడాలని, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2,400 దేవాలయాలు ఉన్నందున ఉత్సవాలు ఘనంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.
దేవాలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీ త్వరగా పూర్తయ్యేలా చూడాలని, ఈసారి దేవాలయాలకు ఇచ్చే డబ్బులు పెంచే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 28 ముఖ్యమైన దేవాలయాలకు ప్రజా ప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో భక్తులు గతంలో కంటే ఎక్కువగా బోనాల ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉందన్నారు.
విద్యుత్, వాటర్‌కు లోటు రానివ్వొద్దు
బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలో జీహెచ్ఎంసీ జాగ్రత్తగా ఉండాలని, మంచినీటి విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని మంత్రి పొన్నం అన్నారు. ప్రధానమైన దేవాలయాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు ఎల్లప్పుడూ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు.
సిటీలో ఉన్న అన్ని దేవాలయ ఉత్సవ కమిటీలతో రెవెన్యూ, పోలీస్, ఇతర విభాగాల అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఎక్కడా, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరించారు. అందరు సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతం చేయాలన్నారు.