
- 472 కేసులు నమోదు చేసి 160 మంది నేరస్తులను అరెస్టు చేసిన బ్యూరో
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) సాధిస్తున్న విజయాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. ‘సైబర్ నేరాలు,- ధోరణులు, రక్షణలు, నియంత్రణ’ అనే అంశంపై ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన నివేదికను స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేసిందని టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
సైబర్ నేరాలను నియంత్రించడంలో సీఎస్‌బీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2024 ఏప్రిల్ లో ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 472 కేసులు నమోదు చేసి 160 మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేసింది. వివిధ నేరాల్లో రూ.283 కోట్లు కొల్లగొట్టిన 800 మంది సైబర్ నేరగాళ్లను సీఎస్‌బీ గుర్తించింది. ఈ వివరాలను పార్లమెంటరీ కమిటీకి అందజేసింది. ప్రధానంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించడానికి తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది.
విజయవంతంగా అమలు చేస్తున్న పద్ధతులను ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని సూచించింది. జాతీయ సైబర్ నేరాల నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రాల్లో సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్రం తగిన మద్దతును అందించాలని పార్లమెంటరీ ప్యానెల్ తన నివేదికలో పేర్కొందని శిఖా గోయల్ తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు.