- ప్రిస్క్రిప్షన్ లేకపోతే షాపు సీజ్
- 75 మెడికల్ షాపులకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బరువు తగ్గే మందుల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఉక్కుపాదం మోపింది. గురువారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మోంజారో, ఓజెంపిక్, విగోవీ, రైబెల్సస్ వంటి వెయిట్ లాస్ డ్రగ్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న 75 మెడికల్ షాపులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, కొనుగోలు,-విక్రయాల బిల్లులు సరిగా లేకపోవడం, రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ లేకుండానే మందులు పంపిణీ చేయడం వంటి ఉల్లంఘనలను ఈ దాడుల్లో గుర్తించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు నకిలీ మందుల బెడదను అరికట్టడమే లక్ష్యంగా ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ చేపట్టినట్లు డీసీఏ వెల్లడించింది.
సొంత వైద్యం ప్రాణాలకే ప్రమాదం..
ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుల సలహా లేకుండా ఇలాంటి మందులను వాడితే ప్రాణాపాయం తప్పదని డీసీఏ డీజీ షానవాజ్ ఖాసిం హెచ్చరించారు. ‘‘గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లో మాత్రమే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు కొనాలి, అనధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మందులు కొని నకిలీ డ్రగ్స్ బారిన పడవద్దు" అని ఆయన సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ విక్రయాలు, నకిలీ మందుల వివరాలకు సంబంధించి సమాచారం ఉంటే డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.

