మెడికల్ కాలేజీలు కాదు… ఫ్యాకల్టీ, స్టాఫ్ సంగతి చెప్పు

మెడికల్ కాలేజీలు కాదు… ఫ్యాకల్టీ, స్టాఫ్ సంగతి చెప్పు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు టీడీఫ్ ప్రశ్న

“మాటి మాటికి కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చినం, కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చినం అని అంటున్నరు. మెడికల్ కాలేజీ అంటే బిల్డింగులు కాదు. ఎంత మంది ఫ్యాకల్టీ, నర్సులు, సహాయక సిబ్బంది ఉన్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్న‌ది అనేదే ముఖ్యమ‌ని” టీఆర్ఎస్ మంత్రుల‌నుద్ధేశించి తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోర‌మ్ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ పీఎస్ విజ‌యేంద‌ర్ అన్నారు.

మెడికల్ కాలేజీ కు అవసరమైన నిబంధ‌నల గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాగా మాట్లాడార‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి ఎర్రగడ్డలో వున్న ఛాతీ ఆసుపత్రి, మానసిక రోగుల ఆసుపత్రి ఎంత దూరంలో వున్నాయని అడిగారు. వాటికి లేని నిబంధనలు ఉస్మానియా ఆసుపత్రికేనా? అని ప్ర‌శ్నించారు. ‘మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలోని ప్రతి డిపార్టుమెంట్‌లో ఎంత మంది ఫ్యాకల్టీ వుండాలి, ఎంత మంది వున్నారు? దీని మీద మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడగలరా?’ అని అన్నారు. ‘డిప్యూటేషన్ల మీద అక్కడ వున్న సిబ్బందిని ఇక్కడ, ఇక్కడ వున్న సిబ్బంది అక్కడ వేస్తున్నారు. కాని అసలు శాశ్వత ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టులను రిక్రూట్మెంట్ ఎన్ని చేశారు, ఎందుకు చేస్త లేరు? ‘అని ప్ర‌శ్నించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎన్ని వుద్యోగాలు భర్తీ చేశారు? అని విజ‌యేంద‌ర్ అడిగారు. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ లో వున్న ఒక ఉన్నత అధికారి… MCI కు తప్పుడు సమాచారం ఇచ్చి మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చారని, ఇది రాష్ట్ర ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా? అని అన్నారు. ‘మీ సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి నుండి ఉస్మానియా ఆసుపత్రికి రోగులను ఇంకా ఎందుకు పంపిస్తున్నారు? మీ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద వున్న చిత్త శుద్ధి ఏమిటి?’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్ర‌శ్నించారు విజ‌యేంద‌ర్.