గణపతి అజ్ఞాతం వీడాలి...ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందిస్తం: డీజీపీ శివధర్ రెడ్డి

గణపతి అజ్ఞాతం వీడాలి...ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందిస్తం: డీజీపీ శివధర్ రెడ్డి
  •     మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలి
  •     పునరావాస పథకం కింద అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ

హైదరాబాద్‌, వెలుగు: మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి(72)  అజ్ఞాతం వీడాలని డీజీపీ శివధర్​రెడ్డి పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో కలిస్తే అనారోగ్యంతో బాధపడ్తున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. శాంతియుత, ప్రజాస్వామ్య మార్గాల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. హింసా మార్గాన్ని విడిచిరాష్ట్ర అభివృద్ధిలో భా గస్వాములు కావాలని సూచించారు. మావోయిస్టుల లొంగుబాటుకు కేంద్రం విధించిన డెడ్‌లైన్‌ మంగళవారం రాత్రి  ముగియనుండడంతో డీజీపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావుతోపాటు ఆయన భార్య జోడే రత్నాబాయి అలియాస్‌ సుజాత(68), జార్ఖండ్‌లో పనిచేస్తున్న పుసునూరి నరహరి అలియాస్‌ సంతోష్(57), వార్త శేఖర్ అలియాస్‌ మంగ్తు(51), నక్క సుశీల అలియాస్‌  రేలా(51), రంగబోయిన భాగ్య అలియాస్‌ రూపి(43) అజ్ఞాతం వీడాలని ఆయన సూచించారు.  

గణపతి అనారోగ్యంతో బాధపడుతున్నారు

సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గత రెండేండ్లలో తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం 721 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారని డీజీపీ తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు వృద్ధాప్యం కారణంగా తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.  ఆయనతోపాటు లొంగిపోయే మావోయిస్టులకు మెరుగైన వైద్యం, పునరావాస పథకం కింద  అన్ని రకాల ప్రయోజనాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్తులంతా తమ కుటుంబాలతో కలిసి స్వగ్రామాల్లో శాంతియుతంగా, గౌరవప్రదంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. 

ఒకటి రెండు రోజుల్లో  మీడియా ముందుకు

అగ్రనేత గణపతి లొంగుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. ఆయన భార్య రత్నాబాయి, పసునూరి నరహరిని కూడా సరెండర్ చేయించేందుకు రాష్ట్ర ఎస్‌ఐబీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ముగ్గురు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఒకటి రెండు రోజుల్లో  మొత్తం ఆరుగురిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ, పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు.