పోలీస్ సేవలపై ఫీడ్ బ్యాక్ ఇవ్వండి: డీజీపీ జితేందర్

పోలీస్ సేవలపై ఫీడ్ బ్యాక్ ఇవ్వండి: డీజీపీ జితేందర్
  • ప్రజలకు డీజీపీ జితేందర్ సూచన

హైదరాబాద్‌‌, వెలుగు:  ఆపదలో పోలీస్ స్టేషన్‌‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించాలని పోలీస్ సిబ్బందిని డీజీపీ జితేందర్ ఆదేశించారు. పోలీసుల ప్రవర్తన, సేవలపై ప్రజలు ఫీడ్ బ్యాక్ అందించాలని సూచించారు. ఇందుకోసం త్వరలోనే క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ ద్వారా ఫీడ్‌‌బ్యాక్ తీసుకునేందుకు కొత్త వ్యవస్థను ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. సిటిజన్‌‌ ఫీడ్ బ్యాక్‌‌ సెంటర్‌‌‌‌ అందించే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని, ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. 

గత నెల రోజుల వ్యవధిలో సిటిజన్ ఫీడ్‌‌ బ్యాక్ సెంటర్ నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన10 పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్‌‌హెచ్ఓలు, ఐదుగురు రిసెప్షన్ ఆఫీసర్లు, ఐదుగురు ఎంక్వైరీ ఆఫీసర్లకు డీజీపీ బుధవారం ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌‌ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. కాలింగ్ యాప్ ద్వారా మాన్యువల్ ఫీడ్‌‌బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో 2,116 మంది పౌరుల నుంచి సేకరించిన అభిప్రాయాలను పరిశీలించామని వెల్లడించారు. సిటిజన్ ఫీడ్‌‌బ్యాక్ సెంటర్ సీఐడీ ఆధ్వర్యంలో నడుస్తోందని.. ఆటోమేటెడ్ కాలింగ్ యాప్ ద్వారా పిటిషన్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్, పాస్‌‌పోర్ట్ డేటా, ఇ–చలాన్, ఎఫ్‌‌ఐఆర్ డేటా వంటి పోలీస్‌‌ సేవల సమాచారాన్ని సేకరిస్తున్నదని తెలిపారు. సమావేశంలో అదనపు డీజీపీ మహేశ్‌‌ భగవత్‌‌, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎస్పీ శ్రీనివాస్, సీఐడీ డీఎస్పీ సీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.