డెంగీ కేసులు  పెరుగుతున్నయ్

డెంగీ కేసులు  పెరుగుతున్నయ్

రాష్ట్రంలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయని డీహెచ్​ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,206 డెంగీ కేసులు నమోదవగా, ఇందులో గడిచిన 20 రోజుల్లోనే సుమారు 700 కేసులు వచ్చాయన్నారు. 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకూ1,206 డెంగీ కేసులు నమోదవగా, ఇందులో గడిచిన 20 రోజుల్లోనే సుమారు 700 కేసులు వచ్చాయన్నారు. డెంగీ కేసులు హైదరాబాద్‌‌లో అత్యధికంగా 447 నమోదవగా, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, అదిలాబాద్‌‌, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో డెంగీ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. కొత్తగూడెం జిల్లాలో డెంగీతో పాటు, మలేరియా కూడా విజృంభిస్తోందని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 509 మలేరియా కేసులు నమోదవగా, అందులో 220 కేసులు కొత్తగూడెం జిల్లాలోనే వచ్చాయన్నారు. ములుగు, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లోనూ మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఆయా జిల్లాల ప్రజలు జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తపడాలని సూచించారు. కోఠిలోని తన ఆఫీసులో శ్రీనివాసరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. దోమల నివారణపై మునిసిపల్, పంచాయతీరాజ్ డిపార్ట్‌‌మెంట్లు చర్యలు తీసుకుంటున్నాయని, ఇండ్లల్లో దోమలు పెరగకుండా ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమ లార్వాలపై అన్ని జిల్లాల్లో సర్వే చేయించామని చెప్పారు. హైదరాబాద్, వనపర్తి, మేడ్చల్, నిర్మల్, రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌‌‌, ఆదిలాబాద్, హనుమకొండ జిల్లాల్లోని 35 నుంచి 50 శాతం ఇండ్లల్లో నీటి ట్యాంకులు, కుండీలు, తొట్లలో దోమ లార్వా కనిపించిందని తెలిపారు. జ్వర బాధితుల ట్రీట్‌‌మెంట్ కోసం ప్రభుత్వ దవాఖాన్లలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 ప్లేట్‌‌లెట్ సెపరేషన్ మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని చెప్పారు.
జ్వరం వస్తే.. కరోనా అనుకోవద్దు
కొంత మంది  జ్వరం వస్తే సొంతగా మందులు వాడి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని డీహెచ్ అన్నారు. సొంత వైద్యం మంచిది కాదని, జ్వరం వస్తే డాక్టర్లను కలవాలని సూచించారు. జ్వరం రాగానే కరోనా అని భ్రమపడొద్దన్నారు. ఇలాగే ఓ డాక్టర్ మరణించిన విషయాన్ని డీహెచ్ ప్రస్తావించారు. ఆమెకు డెంగీ వచ్చినప్పటికీ, కరోనా అనుకుని ట్రీట్‌‌మెంట్ తీసుకుందని, రెండ్రోజుల్లోనే పరిస్థితి విషమించి మరణించిందని చెప్పారు.
సెకండ్ వేవ్ ముగిసింది 
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని డీహెచ్ ప్రకటించారు. థర్డ్ వేవ్ ఇప్పట్లో వచ్చే చాన్స్ లేదన్నారు. ఇంకో కొత్త వేరియంట్ వస్తే తప్ప మరో వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు. హాస్పిటళ్లలో సౌలతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.456 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. కరోనా పూర్తిగా తగ్గిపోయినందున స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని డీహెచ్ అన్నారు. దీనిపై ఇటీవల సీఎస్ రివ్యూ చేశారని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

వ్యాక్సిన్ తీసుకుంటేనే ఎంట్రీ!
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లనే మాల్స్, హోటల్స్‌‌, బస్సుల్లోకి అనుమతించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని డీహెచ్ తెలిపారు. ఒకవేళ అదే అమలైతే  వ్యాక్సిన్ వేసుకోని వాళ్లకు పబ్లిక్ ప్లేస్‌‌లలోకి ఎంట్రీ ఉండదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.23 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని, సుమారు ఇంకో కోటి మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ఇందులో 30 శాతం మంది రెండు డోసులు తీసుకోగా, 70 శాతం మంది సింగిల్ డోసు తీసుకున్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 85 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం12.75 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.