- మిషన్ భగీరథపై 12,457 మందితో ఫీడ్‌బ్యాక్
- సమస్యలను వచ్చే నెల 15 లోగా పరిష్కరించాలి
- అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
- 1916 టోల్ ఫ్రీపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తాగునీటి సరఫరా విషయంలో సర్పంచులదే తుది నిర్ణయమని, వారి అభిప్రాయాల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంజినీర్- ఇన్ -చీఫ్ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులతో నేరుగా మాట్లాడి గ్రౌండ్ లెవల్ రిపోర్టును రెడీ చేసింది. ఈ ఫీడ్‌బ్యాక్‌పై శనివారం మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పది రోజులుగా మిషన్ భగీరథ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,728 గ్రామ పంచాయతీల్లోని సర్పంచులకు ఫోన్ చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. మొత్తం 12,457 మంది సర్పంచులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
నీటి నాణ్యత, క్లోరినేషన్, ట్యాంకుల శుభ్రత, పైపులైన్ లీకేజీలు, నల్లా కనెక్షన్లు సహా 16 కీలక అంశాలపై వివరాలు సేకరించారు. మెజారిటీ సర్పంచులు నీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సర్పంచులు గుర్తించిన సమస్యలను అశ్రద్ధ చేయొద్దని అధికారులను హెచ్చరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచులు చెప్పిన సమస్యలను ఏప్రిల్ 1 నుంచి 15లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇంజినీర్లు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పర్యవేక్షించాలని సూచించారు.
మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్
మిషన్ భగీరథ సౌకర్యం లేని మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడాలు, లంబాడీ తాండాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా వర్షాకాలం ముందే చెక్ డ్యాంలు నిర్మించాలని సూచించారు. అవసరమైన చోట బావులు తవ్వించి నీటి లభ్యత పెంచాలన్నారు. తాగునీటి సమస్యలపై 1916 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
వార్తా పత్రికల్లో లేదా సోషల్ మీడియాలో తాగునీటి సమస్యలపై వచ్చే వార్తలను కేవలం సమాచారంగా చూడకుండా బాధ్యతగా భావించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత వేసవిలో లాగే ఈసారి కూడా ప్రజలకు నీటి కష్టాలు రాకుండా ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
