- పాత పద్ధతులు బంద్.. ప్రొఫెసర్లకూ నెలకోసారి ట్రైనింగ్
- సిలబస్ పూర్తి చేయడం కాదు.. స్కిల్స్ నేర్పడమే ముఖ్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల పనితీరు మారబోతోంది. డిగ్రీలు అచ్చేసి చేతిల పెట్టే ఫ్యాక్టరీల మాదిరిగా కాకుండా.. ఉద్యోగులను తయారు చేసే అడ్డాలుగా వర్సిటీలను మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం యూనివర్సిటీలు, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పనితీరులో మార్పులు తేవాలని డిసైడ్ అయింది. దీనికి అనుగుణంగా విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా వంద రోజుల ప్లాన్ రెడీ చేసి కౌన్సిల్‌కు పంపారు.
2047 నాటికి మన వర్సిటీలు ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఉండాలన్నదే టార్గెట్‌గా ఈ రిపోర్ట్ రూపొందించినట్టు స్పష్టం చేశారు. వర్సిటీల్లో సిలబస్ పూర్తి చేశామా? లేదా? అన్నది ముఖ్యం కాదని.. స్టూడెంట్లకు సబ్జెక్టు అర్థమైందా? లేదా? అనేది ముఖ్యమనేలా పనితీరు ఉండాలని వెల్లడించారు.
ల్యాబ్‌లు షేర్...
అన్ని వర్సిటీల్లో ఏ క్యాంపస్ ల్యాబ్.. ఆ క్యాంపస్‌కే పరిమితం. ఇకపై అట్ల కుదరదు. ఖరీదైన పరికరాలు కొని ఎవరికి వారు దాచుకోవడం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలన్నీ ఆ ల్యాబ్‌లను వాడుకునేలా ‘షేర్డ్ ల్యాబ్స్’ సిస్టమ్ తేవాలని రిపోర్టులో సూచించారు. దీనికోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు. డూప్లికేట్ సామన్లు కొని పైసలు వేస్ట్ చేయొద్దని సూచించారు. దీనికోసం రాష్ట్రమంతటా ల్యాబ్స్ నెట్‌వర్క్ ఉండాలనీ, ఆన్‌లైన్లో బుక్ చేసుకుంటే ఎవరైనా వచ్చి ప్రయోగాలు చేసుకునేలా ఉండాలని పేర్కొన్నారు.
ప్రొఫెసర్లకు కూడా క్లాసులే..
మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాకల్టీలోనూ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం లెక్చరర్లు, ప్రొఫెసర్లకు ట్రైనింగ్ ఇప్పించాలని సర్కారు భావిస్తోంది. నెలకోసారి మాస్టర్ క్లాస్ నిర్వహించి.. కొత్త బోధనా పద్ధతులు, ఏఐ టూల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వనున్నారు. పరిశ్రమల నుంచి నిపుణులను పిలిపించి క్లాసులు చెప్పించాలని డిసైడ్ అయ్యారు. విదేశాల్లో ఉన్న మనోళ్లను, ఇండస్ట్రీ నిపుణులను ‘అడ్జంక్ట్ ఫ్యాకల్టీ’గా తీసుకురావాలని నిర్ణయించారు.
గ్రౌండ్ చాలెంజెస్‌పై రీసెర్చ్..
పరిశ్రమలతో కేవలం అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుని చేతులు దులుపుకోవడం కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పని చేసేలా ప్లాన్ చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. డెలివరీ లేని ఎంవోయూలను రికార్డుల్లో చూపించవద్దని, ఆ ఒప్పందాల వల్ల విద్యార్థులకు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్స్ వస్తేనే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే వర్సిటీల్లో జరిగే రీసెర్చ్ ఏదో చేశామనిపించేలా ఉండకూడదని, హెల్త్, అగ్రిటెక్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా ‘తెలంగాణ గ్రౌండ్ చాలెంజెస్’ పేరుతో పరిశోధనలు జరగాలని పేర్కొన్నారు.
మూడు నెలలకోసారి వర్సిటీలపై రివ్యూ
వచ్చే మూడు నెలల్లో కౌన్సిల్, వర్సిటీలు ఏం చేయాలో అజెండాను ఫిక్స్ చేశారు. ప్రతి వర్సిటీ తమ దగ్గర ఉన్న కోర్సులు, ల్యాబ్స్, ఇండస్ట్రీ లింకేజీలపై పక్కా రిపోర్ట్ (బేస్‌లైన్ మ్యాపింగ్) ఇవ్వాలని, ప్రతి స్టూడెంట్‌కూ ఇంటర్న్‌షిప్ దొరికేలా బ్లూప్రింట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్సిటీలకు స్వయంప్రతిపత్తి ఇస్తున్నాం కదా అని గాలికి వదిలేయబోమని, దానికి తగ్గ జవాబుదారీతనం కూడా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రోగ్రెస్ రివ్యూ ఉంటుందని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కాకుండా గ్రౌండ్ లెవల్‌లో వచ్చిన ఫలితాలనే కొలమానంగా తీసుకుంటామని వివరించారు.
