49 సెంటర్లలో..కౌంటింగ్ ..డిసెంబర్ 3 న ఉదయం 8 గంటలకు ప్రారంభం

49 సెంటర్లలో..కౌంటింగ్ ..డిసెంబర్ 3 న ఉదయం 8 గంటలకు ప్రారంభం
  • 10 గంటల కల్లా ఫస్ట్​ రౌండ్​ ఫలితాలు
  • ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 1,766 టేబుళ్లు
  • పోస్టల్​ బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎలక్షన్​ కమిషన్​ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచే 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్​ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం 49 కౌంటింగ్​ కేంద్రాలను ఈసీ రెడీ చేస్తున్నది. తొలుత పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లను లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఒకవేళ పోస్టల్​ బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు పూర్తి కాకున్నా.. ఈవీఎంల ఓట్ల లెక్కింపు స్టార్ట్​ చేస్తారు. రెండూ సమాంతరంగా లెక్కిస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 1,766 టేబుళ్లు , పోస్టల్‌‌ బ్యాలెట్‌‌ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 

రెండు గంటల్లోనే తొలి రౌండ్​ రిజల్ట్స్​

హైదరాబాద్‌‌ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సెంటర్లను సిద్ధం చేస్తున్నారు. చిన్న నియోజకవర్గాల్లో  రెండు గంటల్లోనే అంటే ఉదయం 10 గంటల్లోపే తొలి రౌండ్‌‌ ఫలితాలు వస్తాయని అధికారులు చెప్పారు. పది నియోజకవర్గాలు మినహా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్​లో 14  టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌‌, ఎల్బీనగర్‌‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, కూకట్‌‌పల్లి, మేడ్చల్‌‌ నియోజకవర్గాల్లో 500కుపైగా పోలింగ్‌‌ కేంద్రాలు ఉండడంతో కౌంటింగ్​ తొందరగా పూర్తి చేసేందుకు ఆయా  నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 

మరో నాలుగు నియోజకవర్గాల్లో 20 వరకు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్​ వైజర్,  కౌంటింగ్ అసిస్టెంట్ , మైక్రో అబ్జర్వర్  ఇలా ఐదుగురు ఒక బృందంగా విధులు నిర్వహిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 రిజర్వ్ బృందాలు,3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయి . 33 జిల్లాలో మొత్తం 49 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. 

హైదరాబాద్​ జిల్లాలోనే 14 కౌంటింగ్​ కేంద్రాలు

హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 కౌంటింగ్​ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా.. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్లను కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కిస్తారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడి విడిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 

స్ర్టాంగ్​ రూమ్​ల దగ్గర భారీ భద్రత

స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన రూమ్​ల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఓ డీసీపీ స్థాయి అధికారి, ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌‌‌‌‌‌‌‌ఐలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించారు.