రూ. 101 కోట్లు, 71 కిలోల బంగారం, 429 కిలోల వెండి.. 10 రోజుల్లోనే పట్టివేత

రూ. 101 కోట్లు, 71 కిలోల బంగారం, 429 కిలోల వెండి.. 10 రోజుల్లోనే పట్టివేత

తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతోంది. చెక్ పోస్టుల్లో గుట్టలు గుట్టలుగా కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. కేజీల కొద్దీ బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అక్టోబర్ 9వ తేదీన తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా..అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు రూ. 101 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేవలం 10 రోజుల్లోనే వంద కోట్లకు పైగా కరెన్సీని పట్టుకోవడం గమనార్హం. 

అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు  పోలీసులు రూ. 101 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా 71 కిలోల బంగారం, 429 కిలోల వెండిని సీజ్ చేశారు. 2.60 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3.42 కిలోల గంజాయిని సీజ్ చేశారు. 

Also Read :- బస్సు ఎక్కితే బహుమతులు : లక్షల్లో ఫ్రైజ్ మనీ

అక్టోబర్ 9వ తేదీన తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బైకులు, కారులు, ఇతర వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న నగదును ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టుబడిన నగదు, బంగారం, వెండి, మద్యాన్ని లెక్కేసుకుంటే..దాదాపు రూ. వెయ్యి కోట్ల వరకు పట్టుబడింది. అయితే ఇంకా అసలు నోటిఫికేషన్ విడుదల కాకముందే ఇన్ని కోట్ల నగదు, బంగారం, వెండి పట్టుబడితే..నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇంతకు రెండు మూడు రెట్లు నగదు లభించే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.