
మరిపెడ, వెలుగు : తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని, పాలనలో మార్పు కోరుకుంటున్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో బుధవారం మీడియాతో మాట్లాడారు. మూడున్నర కోట్ల మంది ఉద్యమం చేసి సాధించిన తెలంగాణలో ఒక్క కేసీఆర్ ఫ్యామిలీకే మేలు జరిగిందన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామని బాధపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరానికి ఒకసారి డీఎస్సీ, రెండేళ్లకోసారి ఇతర నోటిఫికేషన్లు వచ్చేవని, కానీ ప్రస్తుతం ఉపాధ్యాయ నియామకాలే లేవన్నారు. రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ, ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు కేసీఆర్ ప్రభుత్వంలో గుర్తింపే లేదన్నారు. వర్షాలు పడి వచ్చిన నీటిని కాళేశ్వరం నీళ్లు అని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.
డోర్నకల్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే, రాష్ట్ర సంపద మొత్తం కేసీఆర్ ఫ్యామిలీకి, ఆయన అనుచరులకే ధారాదత్తం అవుతుందన్నారు. సమావేశంలో కేయూఎస్‌డీఎల్‌సీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీరన్న నాయక్, కాంగ్రెస్ నాయకులు యుగంధర్‌రెడ్డి, నెహ్రూనాయక్, రఘువీర్‌రెడ్డి, రవీందర్‌నాయక్, శీనునాయక్ పాల్గొన్నారు.