3 రోజుల్లో 6 సభలు .. 25 నుంచి 27 వరకు ప్రధాని మోదీ ప్రచారం

3 రోజుల్లో 6 సభలు .. 25 నుంచి 27 వరకు ప్రధాని మోదీ ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ మరింత ముమ్మరం చేయనుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ఈ నెల 25 నుంచి 27 వరకు వరుసగా మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు. 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తుఫ్రాన్, నిర్మల్,  27న మహబూబాబాద్, కరీంనగర్ సభలకు ఆయన హాజరుకానున్నారు. 27న సాయంత్రం ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకూ 40 కిలోమీటర్ల పొడవునా మోదీతో రోడ్ షో నిర్వహించేందుకు కూడా పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మరోసారి రాష్ట్రానికి రానున్నారు.

ఈ నెల 24న యూపీ సీఎం యోగి, 25 నుంచి అమిత్ షా, నడ్డా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరగనున్న ప్రచార సభల్లో పాల్గొననున్నారు. కాగా, బుధవారం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మలక్ పేటలో,  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జహీరాబాద్ లో, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య వనపర్తిలో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మల్కాజిగిరిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కనీసం 25 నుంచి 30 సీట్లు గెలుచుకోవాల్సిందేనని పార్టీ నేతలకు మోదీ, అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.