తెలంగాణ ఎలక్షన్స్ : ఇందూరు ఇంద్రజాలం .. ఆ రెండు హాట్ సీట్లే

తెలంగాణ ఎలక్షన్స్ :   ఇందూరు ఇంద్రజాలం  .. ఆ రెండు హాట్ సీట్లే

రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో పార్టీ​ జెండా ఎగురవేసి తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్​కు జాతీయస్థాయిలో అండగా నిలువాలని భావిస్తున్నారు. దాదాపు నెలరోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ వ్యూహాలను అమలుచేస్తున్నారు. 

నిజామాబాద్ పార్లమెంట్ సీటుపై సీఎం రేవంత్ మరింత దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఇది బీజేపీ సిట్టింగ్ సీటు అయినా ఈసారి హస్తగతం చేసుకోవాలని సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు పరిధిలో కాంగ్రెస్ 2, బీజేపీ 2, బీఆర్ఎస్ 3 స్థానాలను గెలిచాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ ఓట్లు బాగా పెరిగాయి. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని రంగంలోకి దించారు. ఇక్కడ్నుంచి క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ బలహీనపడటంతో మండల, గ్రామస్థాయి క్యాడర్ కాంగ్రెస్ వైపు మారారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడం, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఒకే సామాజికవర్గం కావడంతో కాంగ్రెస్ కు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. స్థానికంగా పెండింగ్ లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం రాష్ట్ర సర్కారు మంత్రి శ్రీధర్ బాబుతో కమిటీ వేసింది. ఈ కమిటీలో జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదే అంశంతో ఆయన రైతుల ముందుకెళ్తున్నారు. 

గ్రేటర్ పరిధిలో అసెంబ్లీలో సరైన ఫలితాలు రాకపోవడంతో.. ఇక్కడ ప్రయోగాలకే రేవంత్ మొగ్గు చూపించారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. ఇదే సీటు టికెట్ ఆశించిన పట్నం సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్ గిరి బరిలో దింపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓట్లను మళ్లించే వ్యూహంతోనే రేవంత్ పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో తాను గెలిచిన మల్కాజ్ గిరి సీటును మళ్లీ గెలుచుకునేలా లీడర్లు, కేడర్ ను గైడ్ చేస్తున్నారు. ఈ స్థానాల్లో మెజార్టీ ఓట్లు సాధించేందుకు రేవంత్ ప్రత్యేక బృందాలతో మానిటర్ చేస్తున్నారు.