ఆయన వల్లే ఆంధకారం..నోరు అదుపులో పెట్టుకో.. పోదెం వర్సెస్ రేగా..

ఆయన వల్లే ఆంధకారం..నోరు అదుపులో పెట్టుకో.. పోదెం వర్సెస్ రేగా..

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు..నామినేషన్ల పర్వం అసలే మొదలు కాలేదు..కానీ పార్టీల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  ప్రెస్ మీట్లు పెట్టి మరీ..అభ్యర్థులు పరస్పరం తిట్టుకుంటున్నారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య..పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇద్దరు పొట్టు పొట్టు తిట్టుకున్నారు. పరస్పరం పరుష పదజాలంతో దూషించుకున్నారు.  వీరిద్దరి తిట్ల పర్వ..మినీ యుద్ధాన్ని తలపించింది.

దసరా బుల్లోల్లు..గంగిరెద్దుల వాళ్లను నమ్మొద్దు..

తెలంగాణ ఎన్నికల్లో  భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న తెల్లం వెంకట్రావును గెలిపించాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యపై ఘాటు విమర్శలు చేశారు. భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడి ప్రజల బాగోగులను కూడా చూస్తానని రేగా కాంతారావు హామీ ఇచ్చారు. దసరా బుల్లోల్లు, సంక్రాంతి పండగకు వచ్చే గంగిరెద్దు  వాళ్ళను, వారి మాటలను ఈ ఎన్నికల్లో నమ్మకండి అంటూ ప్రజలను కోరారు. అలాంటి వారిని నమ్ముకోవడం వల్లనే భద్రచాలం అంధకారం అయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని..కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వెంటనే భద్రచలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 

నోరు అదుపులో పెట్టుకో..

రేగా కాంతారావు వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య. ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో చేరావని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ  బిక్ష పెట్టిందన్న విషయం మార్చిపోయావా రేగా కాంతారావు అంటూ పోదెం వీరయ్య నిలదీశారు. నన్ను సంక్రాంతి గంగిరెద్దుతో పోలుస్తావా..నువ్వు మనిషివేనా  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకో హెచ్చరించారు. తాను నిఖార్సైన వ్యక్తిత్వం ఉన్నవాడనని..అధికార పార్టీ చూపిన ప్రలోభాలకు లొంగి పార్టీ మారలేదన్నారు. అధికారంలోకి వచ్చాక ఇసుక దందాలు, భూ దందాల లెక్క తేలుస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో బిడ్డా అంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే పొదేం వీరయ్య.