విదేశీ పెట్టుబడులకు గమ్యం తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు

విదేశీ పెట్టుబడులకు గమ్యం తెలంగాణ :  మంత్రి శ్రీధర్ బాబు
  • ఉపాధి కల్పనలో దేశాలతోనే మా పోటీ: మంత్రి శ్రీధర్ బాబు
  • రాష్ట్రంలో ప్రతిభావంతులకు కొదవ లేదు
  • ఫార్మా ఉత్పత్తుల్లో దేశంలో  మేమే నంబర్ వన్ అని వ్యాఖ్య
  • సెక్రటేరియెట్​లో జర్మనీ ప్రతినిధులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఒక మంచి ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో తమ పోటీ.. మిగతా రాష్ట్రాలతో కాదని, తమ పోటీ దేశాలతోనేనని పేర్కొన్నారు. 

సెక్రటేరియెట్​లో మంత్రి శ్రీధర్​బాబుతో జర్మనీకి చెందిన ఫ్రెడరిక్- ఎబర్ట్- స్టిఫ్టంగ్ (ఎఫ్ఈఎస్​) ఫౌండేషన్ ప్రతినిధులు సబీన్ ఫాండ్రిక్, మిర్కో గుంథర్, క్రిస్టోఫ్ మోహ్ర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను వారికి శ్రీధర్ బాబు వివరించారు. రాష్ట్రంలో ప్రతిభావంతులకు కొదవలేదని తెలిపారు. జర్మనీ–తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. 

ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, పరిశ్రమలు వారికి అవసరమైన నైపుణ్యాల్లో యువతకు శిక్షణనిచ్చి నేరుగా నియమించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దిగ్గజ పారిశ్రమికవేత్త ఆనంద్ మహీంద్ర స్కిల్స్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉన్నారన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రీసెర్చ్, వినూత్న ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇన్నొవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేస్తున్నం

రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్ (ఐటీఐ)లను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమలకు మానవ వనరుల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ కోసం జీనోమ్ వ్యాలీలో ఈమధ్యనే ‘1 బయో’ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మెడికల్ ఫార్ములేషన్స్, వ్యాక్సిన్ పరిశోధనలకు ఇది వేదికగా పనిచేస్తుందన్నారు. 

ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా కొత్తగా ఏరో స్పేస్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు దానిని అధిగమించాయని తెలిపారు. రూ.1,300 కోట్లతో ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రన్ విమాన ఇంజన్ల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని నెలకొల్పిందని తెలిపారు. 

రఫేల్ యుద్ధ విమానాల మరమ్మతులు, ఓవర్ హాలింగ్ ఇక్కడే జరుగుతాయని వివరించారు. రాహుల్ గాంధీ హామీ మేరకు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమం కోసం కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ   పాల్గొన్నారు.