- చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్, దండు మల్కాపురంలో ఉద్రిక్తత
చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట, దండు మల్కాపురంలో కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దీంతో రెండు గ్రామాల్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అర్ధరాత్రి టైంలో కొందరు వ్యక్తులు కాంగ్రెస్ దిమ్మెలను కూలగొడుతున్న ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ మండల కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు గౌడ్, చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తదితరులు గురువారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్నారు.
స్థానిక ఎన్నికల్లో గెలవలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఎన్నికల టైంలో గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం సృష్టించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకొని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిమ్మెల ధ్వంసం విషయం తెలుసుకున్న పోలీసులు ఆయా గ్రామాలకు చేరుకొని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, దిమ్మెలను ధ్వంసం చేసింది తెలంగాణ జాగృతి కార్యకర్తలేనని ప్రాథమికంగా నిర్ధారించారు. దిమ్మెలను కూల్చిన నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మాజీ జడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నర్సింహ పాల్గొన్నారు.
