- సౌత్ ఇండియాలో టాప్ ప్లేస్
- జాతీయ సగటు 55.8% ఉంటే.. మన శ్రామిక భాగస్వామ్యం 60.7 శాతం నమోదు
- పల్లెటూర్లలో 55.1 శాతం మహిళలకు చేతినిండా పని
- సోషియో ఎకనామిక్స్ అవుట్ లుక్-2026లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు:
ఆర్థిక వృద్ధి అనగానే కాగితాల మీద కనిపించే అంకెలు మాత్రమే కాదు.. సామాన్యుడికి ఏ రకంగా పని దొరుకుతోంది..? చేతిలో నాలుగు రాళ్లు పడుతున్నాయా లేదా..? అన్నదే అసలైన లెక్క. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం 6.1 శాతంగా ఉన్నా.. ఎవరికి వారే సొంతంగా ఉపాధి వెతుక్కుంటున్న వారి సంఖ్య మన వద్ద పెరుగుతోందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లెక్కలను రాష్ట్ర సోషియో ఎకనామిక్ ఔట్లుక్వెల్లడించింది. పని చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు..? నిజంగా ఎంతమందికి పని దొరికింది..? అనే లెక్కల్లో తెలంగాణ దేశ సగటును ఎప్పుడో దాటేసింది. ముఖ్యంగా మహిళలు అయితే ఉద్యోగాలు, ఉపాధి రంగాల్లోకి దూసుకెళ్తుండడంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేస్తోంది.
జాతీయ సగటుతో పోల్చి చూస్తే తెలంగాణ ప్రజలు పనిచేయడం లేదా పని కోసం వెతకడంలో చాలా ముందున్నారు. దేశం మొత్తం మీద శ్రామిక భాగస్వామ్యం 55.8 శాతం ఉంటే.. తెలంగాణలో ఏకంగా 60.7 శాతంగా నమోదైంది. ఇక పల్లెటూర్లలో అయితే వ్యవసాయం, దాని అనుబంధం రంగాల్లో ఏకంగా 66.1 శాతం మంది పని చేస్తున్నారు. ఉపాధి పనుల్లో పాల్గొనే శ్రామికుల సంఖ్యను మన పక్కనే ఉన్న ఏపీ (57.2%), కర్నాటక, కేరళ రాష్ట్రాలతో పోల్చి చూస్తే.. తెలంగాణ నంబర్ వన్ ప్లేస్ ఉంది.
ఉపాధిలో 'మహిళా' సామ్రాజ్యం..
ఆడవాళ్లు ఇంటికే పరిమితం అనే రోజులు పోయాయి. ఉపాధి రంగంలో తెలంగాణ మహిళలు అదరగొడుతున్నారు. రాష్ట్రంలో మహిళల పని శాతం (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్) ఏకంగా 45.4 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇది 34.9 శాతం దగ్గరే ఉంది. తెలంగాణ పల్లెల్లో అయితే ఏకంగా సగానికి పైగా (55.1%) మహిళలు ఉపాధి పనుల్లో బిజీగా ఉంటున్నారు.
దీనికి ప్రభుత్వం ఇటీవల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి చేసిన మార్పులు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఫుల్ సెక్యూరిటీతో మహిళలు అన్ని షిఫ్టుల్లోనూ (రాత్రి వేళల్లో సైతం) పని చేసుకునేలా ఆంక్షలు ఎత్తివేయడంతో వారు పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ల వైపు క్యూ కడుతున్నారు. ఇది పారిశ్రామిక వృద్ధికి ప్లస్ అవుతోంది.
