ఒడిస్సాలో కల్తీ మద్యం తయారీ స్థావరంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దాడులు

ఒడిస్సాలో కల్తీ మద్యం తయారీ స్థావరంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దాడులు

నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఒడిస్సా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖ  దాడులు చేసి రూ.3 కోట్ల నకిలీ మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒడిస్సాలోని కటక్ లో నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అనంతరం సుమారు కోటి రూపాయలు విలువైన 20వేల లీటర్ల నకిలీ విస్కీని స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సాలో తయారు చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠాను కూడా అధికారులు గుర్తించారు. 

తెలంగాణ నకిలీ లేబుల్ షీట్లు, తయారీ సామాగ్రి, భారీగా నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 26 మందిని అరెస్ట్ చేయగా... మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో శివారెడ్డి, బాలరాజుగౌడ్, సంజయ్ అనే వ్యక్తులను అధికారులు కీలక నిందితులుగా గుర్తించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని, మునుగోడు ఎన్నికలకు ఈ ముఠా.. తెలంగాణ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యాన్ని సరఫరా చేసిందని అధికారులు చెప్పారు. ఒడిస్సాలోని నకిలీ మద్యం స్థావరంపై దాడులు చేసి, ధ్వంసం చేసిన ఎక్సైజ్ పోలీసులు.. విచారణను కొనసాగిస్తున్నారు.