ఖమ్మం టౌన్, వెలుగు : సీపీఐ నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి దిగుబడి మూడో వంతుకు పడిపోయిందన్నారు. అరకొరగా చేతికి వచ్చిన పత్తికి సీసీఐ నిబంధనలు పెట్టి కొనుగోలు చేయడం బాధాకమన్నారు.
ఖమ్మం జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై ఇరవై రోజులైనా పదిహేను వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఈనెల 1 నుంచి ప్రతిరోజు పది నుంచి పన్నెండు వేల క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ ట్రేడర్స్ కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ కపాస్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి పత్తి రైతులను గోస పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిసాన్ కపాస్ రిజిస్ట్రేషన్ లో అనేక టెక్నికల్ సమస్యలు ఉన్నాయని తెలిపారు.
కిసాన్ కపాస్ రిజిస్ట్రేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.8110 చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ కే మీరా, సీఐటీయూ జిల్లా నాయకులు వై.విక్రమ్, భూక్యా శ్రీనివాసరావు,వ్యవసాయ కార్మిక జిల్లా సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్పొరేటర్ గోపి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
