తెలంగాణ నేల మీద వ్యవసాయం అంటే కేవలం ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం. రాత్రింబగళ్లు చెమట చిందించి కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతు, ప్రతి ఏటా పంట చేతికొచ్చే సరికి మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, క్షేత్రస్థాయిలో నెలకొన్న లోపాలు తెలంగాణ అన్నదాతలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి.
ఎంతో ఆశతో పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి వేచి చూడటం, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం నేడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న విషాద చిత్రం. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల ఆలస్యానికి గల కారణాలు, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఒక సమగ్ర పరిశీలన. గత ప్రభుత్వ హయాంలోనూ వరి కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇవే పరిస్థితితు ఎదుర్కొన్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.
రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటనలు వస్తున్నప్పటికీ, ఆచరణలో కొనుగోళ్లు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. నిజామాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రధాన జిల్లాల్లో రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి 20 రోజులుకు పైగా వేచి చూడాల్సి వస్తోంది. తీవ్రమైన ఎండల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నా, రైతులు తమ ధాన్యం కుప్పల వద్దే రాత్రి పగలు కాపలా కాస్తూ జాగారం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట త్వరగా అమ్ముడుపోతేనే.. తెచ్చిన అప్పులు తీర్చి తదుపరి పంటకు సిద్ధమవడానికి వీలవుతుంది. కానీ అధికారుల సమయపాలన లేకపోవడం, తూకాలలో జాప్యం వల్ల కొనుగోలు కేంద్రాల వెలుపల కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిచిపోతున్నాయి.
రైతులను వేధిస్తున్న ప్రధాన సవాళ్లు
ధాన్యం సేకరణ ప్రక్రియలో ఉన్న లోపాల వల్ల రైతులు మానసిక వేదనకు గురికావడంతోపాటు తీవ్ర ఆర్థికనష్టాలను కూడా చవిచూస్తున్నారు. అకాల వర్షాల భయం కూడా వారిని వెంటాడుతోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వచ్చే అకాల వర్షాలు, ఈదురు గాలులు ఓపెన్ కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలను ముంచెత్తుతున్నాయి. కేంద్రాలలో తగినన్ని తార్పాలిన్లు (కవర్లు) అందుబాటులో లేకపోవడం వల్ల ధాన్యం తడిసి, మొలకలు వస్తున్నాయి.
ఇలా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు నిరాకరిస్తుండటంతో రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. పంట నష్టపోయి, కొనుగోలు కేంద్రాల వద్దే గుండె ఆగి మరణించిన రైతుల ఉదంతాలు గుండెలను పిండేస్తున్నాయి. మరోవైపు.. గోనె సంచులు, హమాలీల కొరత కూడా రైతులను వేధిస్తోంది.బెంగాల్‌కు చెందిన హమాలీలు తమ రాష్ట్రంలో ఎన్నికల కోసం వెళ్లి తిరిగి రానందున హమాలీల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. రవాణా లారీల కొరత ప్రధాన కారణంగా మారింది.
లారీల కొరత కారణంగా తూకం వేసిన బస్తాలు కూడా కేంద్రాల్లోనే పేరుకుపోయి, మళ్లీ వర్షానికి తడిసిపోయే ప్రమాదం పొంచి ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో లారీ డ్రైవర్లు, కాంట్రాక్టర్లు రైతుల నుంచి అదనంగా మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
మిల్లర్ల 'తరుగు' దోపిడీ
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రైస్ మిల్లులకు చేరిన తర్వాత, మిల్లర్లు రకరకాల వంకలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో క్వింటాలుకు 5 నుంచి 7 కిలోల వరకు అదనంగా కటింగ్ (తరుగు) విధిస్తున్నారు. పొట్టు, ధూళి కారణాలుగా చూపుతున్నారు. ధాన్యంలో తాలు, పొట్టు ఉందంటూ నిబంధనలకు విరుద్ధంగా బస్తాకు కొన్ని కిలోల చొప్పున మినహాయిస్తున్నారు.
ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఈ తరుగుల రూపంలో రైతు ప్రతి క్వింటాలుపై వందలాది రూపాయలు నష్టపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఒకలా తూకం వేస్తే, మిల్లుల వద్ద మరోలా తూకం వేస్తూ డిడక్షన్లు చేయడం వల్ల పండించిన రైతుకు దక్కాల్సిన లాభమంతా మిల్లర్ల పాలవుతోంది. ప్రభుత్వ కేంద్రాల వద్ద నిరీక్షించలేక చాలామంది చిన్న, సన్నకారు రైతులు మద్దతు ధర కంటే రూ.500 నుంచి రూ.600 తక్కువకే స్థానిక దళారులకు తమ ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు.
పరిష్కార మార్గాలు – సూచనలు
పంట కోతల సమయానికి కనీసం నెల రోజుల ముందే కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరవాలి. అవసరమైన గన్నీ బ్యాగులు, తార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలను ముందే సిద్ధం చేసుకోవాలి. మిల్లర్ల అక్రమాలపై కఠిన చర్యలు చేపట్టాలి. మిల్లుల వద్ద తరుగు పేరిట రైతులను దోపిడీ చేసే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి మిల్లు వద్ద పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించాలి. రవాణా వ్యవస్థ బలోపేతం చేయాలి.
కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తూకం వేసిన 24 గంటల్లోగా లారీల ద్వారా మిల్లులకు తరలించేలా రవాణా కాంట్రాక్టర్లపై కఠిన నిబంధనలు అమలు చేయాలి. శాశ్వత నిల్వ సౌకర్యాలు కల్పించాలి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ, ప్రధాన మార్కెట్ యార్డుల్లోనూ అధునాతన కోల్డ్ స్టోరేజ్ లేదా క్లోజ్డ్ గోదాములను నిర్మించాలి. తెలంగాణను ‘దేశానికే అన్నపూర్ణ’గా కీర్తిస్తున్న తరుణంలో, ఆ అన్నంపెట్టే రైతే కొనుగోలు కేంద్రాల వద్ద కన్నీరు కార్చడం మనందరం ఆలోచించాల్సిన విషయం.
గోదాముల కొరత
ధాన్యం కొనుగోళ్లలో కేవలం స్థానిక లోపాలే కాకుండా, వ్యవస్థాగత సమస్యలు కూడా ఒక ప్రధాన కారణం. సేకరించిన ధాన్యాన్ని భద్రపరచడానికి రాష్ట్రంలో తగినన్ని శాశ్వత గోదాములు లేవు. దీనివల్ల ధాన్యాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉంచాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, బియ్యం సేకరణపై ఆంక్షల వల్ల రాష్ట్రంలో మిగులు నిల్వలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్తున్నా, బ్యాంక్ లింకేజీలు, సాంకేతిక లోపాల వల్ల కొన్ని ప్రాంతాల్లో డబ్బులు చేతికి రావడానికి చాలా సమయం పడుతోంది.
- డా. చిట్టెడ్డి కృష్ణారెడ్డి,అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
