
- డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు 42% కోటా.. ఎస్సీలకు 15% , ఎస్టీలకు 10%
- కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్టోబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్!
- మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీ డ్రా..త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై జీవో
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల చొప్పున ఖరారు చేయాలని తెలిపింది. వార్డులకు గ్రామం యూనిట్‌గా.. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు మండలం యూనిట్‌గా.. జెడ్పీటీసీకి జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఆదివారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. వారంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇస్తుందని, ఆలోపు రిజర్వేషన్లు కంప్లీట్ చేసి పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉండాలని సీఎస్ సూచించినట్లు తెలిసింది. ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను చేపడ్తున్నది. గడువులోగా ఎలాగో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నామని, అక్టోబర్‌లో ఎన్నికలు పూర్తి చేస్తామని, ఇదే క్రమంలో కొంత గడువు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ వేయనున్నట్లు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. దానిని ప్రభుత్వం జిల్లాలకు పంపించింది. ఈ ప్రకారమే కలెక్టర్లు రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు. మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు కేటాయించాల్సి ఉన్నందున విమెన్ రిజర్వేషన్ కోసం లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు, మూడు రోజుల్లోగా రిజర్వేషన్లు రెడీ చేసి పెట్టుకోవాలని.. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు తగ్గట్టు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వాటిని పబ్లిష్ చేయాల్సి ఉంటుందని సూచించింది. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నివేదికలో ఎక్కడ, ఏ రిజర్వేషన్.. అనేది క్లియర్‌గా ఉన్నందున వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపింది.
ప్రత్యేక జీవోతో ముందుకు..
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 % పెంచుతూ చేసిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర ఉంది. రిజర్వేషన్ల పరిమితి 50% ఎత్తి వేస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లు కూడా గవర్నర్ దగ్గ ర పెండింగ్‌లో ఉంది. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం అంశంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. దీంతో బీసీలకు 42 % రిజర్వేష న్లు కల్పించాలంటే ప్రత్యేకంగా జీవో ఇవ్వాల్సిన పరిస్థి తి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎస్టీలకు జీవో నోటిఫికేషన్‌తో రిజర్వేషన్లు పెంచినట్లుగా.. బీసీ లకు పెంచుతూ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బీసీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు కో ఆర్డినేట్ చేసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ జీవో నోటిఫికేషన్ ఇస్తే.. దాన్ని అడాప్ట్ చేసుకుంటూ పంచాయతీరాజ్ శాఖ మరొక ఉత్తర్వు ఇవ్వనున్నట్లు తెలిసింది.
జీవోపై కోర్టుకు వెళ్లినా అక్టోబర్లోనే ఎన్నికలు పెట్టేలా ఏర్పాట్లు
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఇచ్చే జీవోపై ఎవరైనా హైకోర్టుకు వెళ్తే ఎలా అనేదానిపైనా కూడా ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటే.. హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో దాని ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ ప్రభుత్వ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేస్తే.. పాత రిజర్వేషన్ల ప్రకారం 50 శాతంలోపు అమలు చేయనున్నారు. అలాంటి పరిస్థితిలో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి, ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నది.
ఇందుకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్‌లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నది. ముందు ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ రెండు కూడా వారం రోజుల గ్యాప్‌లోనూ పూర్తి చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సులు వంటివన్నీ రెడీ చేసుకుని.. రిజర్వేషన్ల జాబితా కోసం వెయిట్ చేస్తున్నది.