
హైదరాబాద్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డగా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని కేసీఆర్ అంటున్నడు. ఔను.. 60 వేల బెల్టుషాపులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. వైన్‌షాపుల టెండర్ల పేరుతో రూ. 2,500 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిండు’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్‌రోడ్డును నిర్మిస్తే.. దాన్ని కేసీఆర్ రూ.7,500 కోట్లకు తెగనమ్ముకున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో ఎ.చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారని, ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. చరిత్ర తిరగేసి చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలుస్తుందని రేవంత్ అన్నారు. ‘‘సాగునీటి ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నాగార్జునసాగర్ కట్ట మీద చర్చకు సిద్ధమా” అని కేసీఆర్‌కు సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్లు మింగారని ఆయన ఆరోపించారు.
కామారెడ్డిలో ఇప్పటికీ 22వ ప్యాకేజీ పనులు పూర్తికాలేదని, కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే.. అక్కడ కేసీఆర్ అడుగుపెట్టాలన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో పదేండ్లలోనే పేదలకు 25 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చినం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చోట కేసీఆర్ ఓట్లు అడగొద్దు.. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన చోట మేమూ అడగబోం. కేసీఆర్‌కు ఇదే నా సవాల్. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని తుంగలో తొక్కిండు” అని ఆయన మండిపడ్డారు.
కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకున్నరు
‘‘కమ్యూనిస్టులను వాడుకున్న కేసీఆర్.. ఆ తర్వాత కరివేపాకులా తీసిపారేసిండు” అని రేవంత్ విమర్శించారు. బీజేపీతో ఉన్న బంధంతోనే కమ్యూనిస్టులను వదిలేశారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. ‘‘కేసీఆర్‌ను ఓడించే సత్తా బీజేపీకి ఉందని భావించి ఆ పార్టీలో చేరిన. కానీ, అది సాధ్యం కాదని తేలడంతోనే కాంగ్రెస్‌లో చేరుతున్న. రెండు నెలల కింద చేవెళ్లలో సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో నేను దళితుడినని చెప్పి అమిత్ షా నేను తెచ్చిన శాలువాను తీసుకోలేదు. ఆ సభలో నాకు ఘోరంగా అవమానించారు” అని ఆయన పేర్కొన్నారు.