గోల్కొండ కోటలో అవతరణ వేడుకలు.. జెండా ఆవిష్కరించనున్న కిషన్​రెడ్డి

గోల్కొండ కోటలో అవతరణ వేడుకలు.. జెండా ఆవిష్కరించనున్న కిషన్​రెడ్డి
  • గోల్కొండ కోటలో  అవతరణ వేడుకలు
  • ఇయ్యాల నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం
  • జెండా ఆవిష్కరించనున్న  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు

హైదరాబాద్, వెలుగు:  గోల్కొండ కోట వేదికగా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి  వరకు పలు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం గోల్కొండ కోటకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులపై పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

అన్ని రాష్ట్రాల రాజ్ ​భవన్లలోనూ నిర్వహిస్తున్నం: కిషన్​రెడ్డి

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కిషన్​రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ ఈ వేడుకలకు హాజరవుతారని చెప్పారు. ‘‘1,200 మంది ఆత్మ బలిదానాలతో రాష్ట్రం ఏర్పాటైంది. బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా  స్వరాజ్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపించింది. తెలంగాణ కోసం ఢిల్లీలో నిరసన తెలిపిన సందర్భంలో జంతర్ మంతర్​లో మాపై పోలీసులు రెండు సార్లు లాఠీచార్జ్​ చేశారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న  కాంగ్రెస్ పార్టీ ఈ దాడులు చేయించింది” అని తెలిపారు. అజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మొదటిసారి అన్ని రాష్ట్రాల రాజ్ భవన్లలో తెలంగాణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గత సంవత్సరం కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్ర సర్కార్ కు, ఇక్కడి  ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదని, తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. 

ఇదీ షెడ్యూల్​..

శుక్రవారం ఉదయం 7 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట వద్దకు చేరుకుంటారు. 7.10 గంటలకు ఆయన జాతీయ జెండా ఎగురవేస్తారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. 7.20 గంటలకు ఫొటో,  పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు.  సాయంత్రం 5.30 గంటలకు కిషన్ రెడ్డి మళ్లీ గోల్కొండ కోటకు చేరుకొని..  6:05 గంటలకు స్వాగతోపన్యాసం చేస్తారు. అనంతరం డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుంది.  

6.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అతిథులను ఉద్దేశించి కిషన్ రెడ్డి ముగింపు ప్రసంగం ఉంటుంది.  6.30 గంటల నుంచి 7.40 గంటల వరకు డా. ఆనంద శంకర్, మంజుల రామస్వామి బృందం ఆధ్వర్యంలో శాస్త్రీయ, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 7.40 గంటల నుంచి 7.50 గంటల వరకు సింగర్లు మంగ్లీ, మధుప్రియ పాటల ప్రదర్శన, 8 గంటలకు  ప్రముఖ సంగీత దర్శకులు శంకర్ మహదేవన్ ఆధ్వర్యంలో  దేశభక్తి పాటల ప్రదర్శన ఉంటుంది. రాత్రి 9 గంటలకు ధన్యవాద సమర్పణతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.