మన్ననూర్ లో సీఎం సభకు ఏర్పాట్లు

మన్ననూర్ లో సీఎం సభకు ఏర్పాట్లు
  • ఈనెల 18న ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రారంభం
  • అన్ని శాఖలు సమన్వయంతో ముమ్మర ఏర్పాటు చేయాలి
  • అధికారుల సమీక్షలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ 

అమ్రాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ఆదివాసీ రైతుల అభివృద్ధికి దోహదపడుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈనెల 18న  అమ్రాబాద్ మండలం మన్ననూర్, మాచారం గ్రామాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో శనివారం హెలిప్యాడ్, బహిరంగ సభ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించారు. అమ్రాబాద్ లోని రైతు వేదిక వద్ద 62 మంది రైతులకు సబ్సిడీ స్ప్రింక్లర్లను అందించారు.

అనంతరం ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ వద్ద కలెక్టర్ సంతోష్ కుమార్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, డీఎఫ్ఓ రోహిత్ గోపిడీ, ఆర్డీఓ మాధవి, డీఎస్పీ శ్రీనివాసులు, డీఈ హేమలతతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూరులో ప్రవేశపెట్టనున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సంబంధించి చేపట్టాల్సిన పనులను అధికారులకు వివరించారు.

ఏజెన్సీ లోని ఆదివాసీ, గిరిజన ప్రజల వ్యవసాయ భూములకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించి వారి భూముల్లో ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మన్ననూరులో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు, అందుకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని సూచించారు.

-రూ. 12,600 కోట్లతో 6 లక్షల ఎకరాల పోడు భూములకు పథకం వర్తింపజేయనుండగా..- 2.10 లక్షల చెంచు, గిరిజన రైతులకు మేలు జరుగుతుందన్నారు.  ఏజెన్సీలోని ఆదివాసీ, గిరిజన రైతుల వ్యవసాయ భూములకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించి ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.