వేములవాడ, వెలుగు: మహాశివరాత్రి జాతర కోసం వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్గరిమా అగ్రవాల్ అధికారులనుఆదేశించారు. సమ్మక్క–సారలమ్మ జాతర, మహా శివరాత్రి నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పనులను ఎస్పీ మహేశ్ బీ.గీతేతో కలిసి గురువారం పరిశీలించారు.
ఆలయంలో తాగునీటి సరఫరా, ప్రసాదం కౌంటర్ వద్ద ఏర్పాట్లు, పార్కింగ్ ఏరియా, టాయిలెట్లు, షవర్ స్నానాలకు ఏర్పాట్లు, కోడె మొక్కుల టికెట్ కౌంటర్, వీఐపీ, వీవీఐపీ, ప్రత్యేక దర్శనం క్యూలైన్లు, నీటి సరఫరాకు తదితర ఏర్పాట్లను కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. బద్ది పోచమ్మ ఆలయం వద్ద బిల్డింగ్ స్లాబ్ పనులు పూర్తి చేసి, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భీమేశ్వర, బద్ది పోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని కలెక్టర్, ఎస్పీ దర్శించుకున్నారు. వారితో పాటు ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీవో రాధాభాయ్, ఆర్అండ్‌బీ ఈఈ నరసింహాచారి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, సీఐ వీరాప్రసాద్ ఉన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భద్రతా నియమాల పోస్టర్లను కలెక్టరేట్‌లో గురువారం ఆమె ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి వాహనదారుల వరకూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, ఎంవీఐ వంశీధర్, సివిల్ సప్లై ఆఫీసర్ చంద్రప్రకాశ్, ఏఎంవీఐలు రజనీదేవి, పృథ్వీరాజ్ వర్మ పాల్గొన్నారు.
