
- శాంతి చర్చల కమిటీ చైర్మన్, జస్టిస్ చంద్రకుమార్ వెల్లడి
కరీంనగర్, వెలుగు: మావోయిస్టులతో కేంద్రం వెంటనే చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్, రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ సూచించారు. చర్చలకు సిద్ధంగా లేమని కేంద్రం ప్రకటించడం సరికాదని, ఇరువైపులా ప్రాణాలు పోవాలని కోరుకుంటుందా..? అని ప్రశ్నించారు. చావులతో సమస్యలు పరిష్కారం కావన్న విషయాన్ని ఇరువర్గాలు గుర్తించాలని సూచించారు. కరీంనగర్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టులతో చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నట్లు, ఎవరి ప్రాణాలు పోకూడదన్నదే తమ అభిప్రాయమన్నారు.
మావోయిస్టులు, పోలీసులు సీజ్ ఫైర్ పాటిస్తూ చర్చలకు రావాలని కోరారు. ఇరువర్గాలకు సంధానకర్తలుగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటికే కర్రెగుట్టల్లో ఎంతో మంది పోలీసులు, మావోయిస్టులు చనిపోయారని గుర్తు చేశారు. పాక్ దాడులతో చనిపోయిన బాధిత కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నామన్నారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మావోయిస్టులు అన్ కండిషనల్ గా చర్చలకు సిద్ధంగా కావాలని ఆయన పేర్కొన్నారు.