- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, టౌన్: మహిళా పాలకులుంటే ప్రజా సమస్యలు తగ్గుతాయని కలెక్టర్ పమేలా సత్పతి, సినీనటి రెజీనా కసాండ్రా అన్నారు. కరీంనగర్‌లోని కళాభారతిలో డెమోక్రటిక్ సంఘ్ ఆధ్వర్యంలో పలువురు మహిళా వార్డు సభ్యులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ10 ఏండ్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నానని, మహిళా పాలకులు ఉన్నచోట ప్రజా సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తు చేశారు. మహిళలు తమ ఆత్మగౌరవం కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తమ్ముడు, భర్త, తండ్రి, కుమారుడు చెప్పినట్లు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మహిళా వార్డు సభ్యులకు సూచించారు.
సినీ హీరోయిన్, డెమొక్రటిక్ సంఘ్కో ఫౌండర్ రెజీనా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళల్లో అసాధారణ శక్తి ఉంటుందని, సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
స్కూళ్లలో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫిర్యాదుల పెట్టెలను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం ‘స్నేహిత’ కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో ఫిర్యాదులు పెట్టెల నిర్వహణపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, మహిళ కానిస్టేబుళ్లు, సీడీపీవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్లతో సీపీ గౌష్ ఆలంతో కలిసి కలెక్టర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
స్కూళ్లలో స్టూడెంట్లకు వేధింపులు కలిగితే ధైర్యంగా తెలియజేసేందుకు ఫిర్యాదుల పెట్టే విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. స్కూళ్లలో నేరాలు, లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిస్తే టీచర్లు,హెచ్ఎంలు వెంటనే ఆఫీసర్లకు తెలియజేయాలని అన్నారు. సీపీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి స్కూల్‌లో ఫిర్యాదుల పెట్టె నిర్వహణకు మహిళా పోలీసును కేటాయించామని తెలిపారు.
