- కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ఘటన
గన్నేరువరం, వెలుగు: పంచాయితీకి పిలిచి కొడతారనే భయంలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రంగనవేని వేణు(15) అదే గ్రామానికి చెందిన బోయిని సాయికుమార్ స్నేహితులతో కలిసి డిసెంబర్ 31న గ్రామ శివారులోని మామిడి తోటలో దావత్ చేసుకున్నారు. దావత్ లో వేణు, సాయికుమార్ మధ్య గొడవ జరిగి కొట్టుకున్నారు. సాయికుమార్ ఇంటికి వెళ్లి తండ్రి బోయిని చంద్రయ్యకు గొడవ గురించి చెప్పాడు. దీంతో చంద్రయ్య జనవరి 1న కుల పెద్దలను కలిసి తన కొడుకును వేణు కొట్టాడని రూ.20 వేలు తీసుకొని 2న పంచాయితీకి రావాలని పెద్దమనుషులతో వేణు తండ్రికి కబురు పెట్టించాడు.
దీంతో భయపడిన వేణు అదే రోజు ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. తండ్రి ఇంటికి వచ్చేసరికి వాంతులు చేసుకోగా, వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ వేణు గురువారం చనిపోయాడు. మృతుడి తండ్రి రంగనవేని రాజేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.
