అందాల పోటీల భద్రతలో ఆమె

అందాల పోటీల భద్రతలో ఆమె
  • మిస్ వరల్డ్ ఈవెంట్ సెక్యూరిటీలో మహిళా పోలీసుల కీలక పాత్ర 
  • 116 మంది కంటెస్టెంట్లకు 2 వేల మంది విమెన్ కానిస్టేబుళ్లు 
  • ఒక్కో కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌కు సెక్యూరిటీగా ముగ్గురు చొప్పున నియామకం 
  • ఈవెంట్స్ జరిగే హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో 500 మంది.. కంటెస్టెంట్లు పర్యటించే జిల్లాల్లో 1,500 మంది సిబ్బంది 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:మిస్ వరల్డ్‌‌‌‌‌‌‌‌–2025 పోటీల భద్రతలో రాష్ట్ర మహిళా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హాజరైన సుందరీమణులకు రక్షణ కవచంగా వ్యవహరిస్తున్నారు. 116 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు, విదేశీ మహిళా ప్రతినిధులకు భద్రతాపరంగా భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2వేల మంది మహిళా కానిస్టేబుళ్లు మిస్ వరల్డ్‌‌‌‌‌‌‌‌ బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు.

 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఈవెంట్స్ కోసం 500 మంది ఏఆర్ సిబ్బంది, కంటెస్టెంట్లు పర్యటించే ప్రాంతాల్లో ఆయా జిల్లాల వారీగా మరో 1,500 మంది మహిళా పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఒక్కో కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌కు ముగ్గురు చొప్పున కానిస్టేబుళ్లను నియమించారు.  

కంటెస్టెంట్లు పర్యటించే ప్రాంతాల్లోనూ..

అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షణలో మిస్​వరల్డ్​పోటీలకు భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లతో కంటెస్టెంట్లను కోఆర్డినేట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు లైజింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను నియమించారు. సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలో ప్రతి కంటెస్టెంట్‌‌‌‌‌‌‌‌కు ముగ్గురు చొప్పున ఆర్మ్‌‌‌‌‌‌‌‌డ్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ (ఏఆర్) విమెన్ కానిస్టేబుళ్లను నియమించారు. కంటెస్టెంట్లు బస చేసే హోటల్స్‌‌‌‌‌‌‌‌లో మహిళా ఎస్‌‌‌‌‌‌‌‌ఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. లైజనింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల నుంచి అందించిన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ మేరకు సంబంధిత విమెన్ కానిస్టేబుల్స్‌‌‌‌‌‌‌‌ అవసరమైన భద్రత కల్పిస్తున్నారు.

 కంటెస్టెంట్లు జిల్లాల్లో పర్యటించే 22 ప్రాంతాల్లో ఆయా జిల్లా యూనిట్ల వారీగా ప్రతి టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ స్పాట్‌‌‌‌‌‌‌‌లో సుమారు 50‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంది చొప్పున మహిళా సిబ్బందిని కేటాయించారు. కంటెస్టెంట్లు సహా విదేశీ మహిళా ప్రతినిధులు బస చేస్తున్న హోటల్స్‌‌‌‌‌‌‌‌, పరిసర ప్రాంతాలను స్థానిక పోలీసులు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు.

నిఘా నీడలో హైటెక్స్, గచ్చిబౌలి

ఈవెంట్‌‌‌‌‌‌‌‌ జరిగే ప్రాంతం సహా తిరిగి హోటల్‌‌‌‌‌‌‌‌కు చేరేంత వరకు కంటెస్టెంట్లకు మహిళా పోలీసులు కవచంగా నిలుస్తున్నారు. హోటల్‌‌‌‌‌‌‌‌లో బస, సిటీలో పర్యటన సహా మిస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ ముగింపు వేడుకలు.. తిరిగి వారి దేశాలకు వెళ్లేంతవరకు వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సెక్యూరిటీ కల్పించనున్నారు. ఈవెంట్లు జరుగుతున్న సైబరాబాద్‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని హెటెక్స్‌‌‌‌‌‌‌‌, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో దాదాపు 8 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

 గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ జరుగనున్న హైటెక్స్ ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ సహా పర్యాటక ప్రాంతాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాలను సైబరాబాద్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ సహా బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అనుసంధానం చేసి24 గంటలు మానిటరింగ్​ చేస్తున్నారు.