
- భూ భారతితో ప్రతి ఒక్కరికి న్యాయం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్
భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు : వచ్చే జూన్2న ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి కల్పించబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌తో కలిసి శనివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా రూ. 9వేల కోట్లతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. రూ. 12,500కోట్లతో గిరిజనుల వ్యవసాయానికి ఇందిరగిరి జల వికాస్పథకాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు.
రూ. 22,500కోట్లతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. బీఆర్ఎస్సర్కార్ కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లు తెచ్చి గోదారిలో పోసిందని, కేసీఆర్ రూ. 7లక్షల కోట్లు అప్పు చేసి తమపై మోపారని మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొద్ది రోజుల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
దేశంలోనే రైజింగ్ తెలంగాణను మార్చుతుండగా మిగతా రాష్ట్రాలన్నీ మనవైపే చూస్తున్నా యన్నారు. ధరణి పుణ్యమా అని ఆడవాళ్ల మెడలో పుస్తెలు అమ్ముకున్నా న్యాయం జరగలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. భూ భారతి చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. యాసంగిలోనూ సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహూల్ పాల్గొన్నారు.