
- సైంటిస్ట్ వెంకటేశ్వర రావు నేతృత్వంలో ఏర్పాటు
- నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశం
- నేడు ఫ్యాక్టరీకి వెళ్లి పరిశీలించనున్న కమిటీ
- 40కి చేరిన మృతుల సంఖ్య.. 18 డెడ్‌బాడీలు బంధువులకు అప్పగింత
- మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించిన కంపెనీ
- గాయపడినోళ్లకు వైద్య సాయం, పునరావాసం కల్పిస్తామని హామీ
- 3 నెలలు ప్లాంట్ క్లోజ్.. పేలుడుకు రియాక్టర్ కారణం కాదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు ప్రభుత్వం ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర రావు నేతృత్వంలో చీఫ్ సైంటిస్ట్ ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, పుణెకు చెందిన భద్రతా అధికారి సంతోశ్ ఘుగే సభ్యులుగా కమిటీని నియమించింది. ఈ మేరకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిగాచి ఇండస్ట్రీలో ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడంతో పాటు పరిశ్రమల్లో కార్మికుల భద్రత కోసం సూచించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) అమలవుతున్నదా? లేదా? యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా? అనే అంశాలను గుర్తించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. రసాయన, ఔషధ పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని సూచించింది. నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. కమిటీ తమ విచారణలో భాగంగా గురువారం
ఫ్యాక్టరీని సందర్శించనుంది. నిర్వాహకులు, టెక్నీషియన్స్, ఎంప్లాయ్స్, అధికారులతో సమావేశమై అవసరమైన సమాచారం సేకరించనుంది. కాగా, కమిటీ సభ్యులు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలు, నష్టాన్ని అంచనా వేయ డం లాంటి అంశాలపై చర్చించారు. ఇందులో ఇండియ న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)
డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు.