
- గజం నర్మద, గూడ పవన్‌కు అవార్డులు
- ఇది ప్రతిభకు దక్కిన గౌరవం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి చెందిన ఇద్దరు చేనేత కార్మికులకు జాతీయ చేనేత పురస్కారం-2024 లభించింది. ఈ పురస్కారానికి దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులను కేంద్ర చేనేత, జౌళి శాఖ ఎంపిక చేసింది. ఈ లిస్టులో తెలంగాణ నుంచి మార్కెటింగ్ విభాగంలో గజం నర్మద,యువ చేనేత విభాగంలో గూడ పవన్కుమార్చోటుదక్కించుకున్నారు. వీరిద్దరూ ఆగస్టు 7న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు. గజం నర్మదా స్వస్థలం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం.
చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో ఆమె రూ.8 కోట్ల టర్నోవర్ సాధించారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌తో పాటు విదేశాల్లోనూ ఇక్కత్ వస్త్రాలకు నూతన డిజైన్లతో మార్కెట్ సృష్టించారు. అదే గ్రామానికి చెందిన గూడ పవన్ కుమార్.. సహజసిద్ధ రంగులతో జీఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్‌తో పట్టుచీరను నేసి, యంగ్ వీవర్ విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ చీర ధర రూ.75 వేలు ఉంటుంది. గతేడాది ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట పవన్ కుమార్ మగ్గంపై వస్త్రం నేశారు.
రాష్ట్రానికే గర్వకారణం: మంత్రి తుమ్మల
ఈ జాతీయ పురస్కారం రాష్ట్ర చేనేత కళాకారుల ప్రతిభకు నిదర్శనమని.. వారి కృషి రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన ఇద్దరికి అభినందనలు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. ఇటీవల చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీ ప్రకటించినట్లు చెప్పారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెంచేందుకు ప్రత్యేక లేబుల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం చేనేత భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.