వేధింపులు ఆపకుంటే గ్యాస్ డెలివరీ బంద్ చేస్తాం : నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్

వేధింపులు ఆపకుంటే గ్యాస్ డెలివరీ బంద్ చేస్తాం : నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్

బషీర్​బాగ్​, వెలుగు: కుకింగ్ గ్యాస్ డెలివరీ కార్మికులను వేధిస్తున్న గ్యాస్ డీలర్లపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తామని తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 30 వేల మంది గ్యాస్ డెలివరీ వర్కర్లు పనిచేస్తున్నారని, ఏ ఒక్క గ్యాస్ ట్రేడర్ కూడా కార్మిక శాఖ నిబంధనలు పాటించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.

 జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని, అకారణంగా పని నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ సలహాదారుడు చామకూర రాజు మాట్లాడుతూ.. తమ ఫిర్యాదులను పట్టించుకోకపోతే త్వరలో కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సలహాదారుడు కేవీ.గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర చంద్రయ్యగౌడ్, నర్సింగరావు, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.