తెలంగాణకు నాలుగు అవార్డులు

తెలంగాణకు నాలుగు అవార్డులు

న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన పురస్కారాల్లో తెలంగాణకు నాలుగు అవార్డులు దక్కాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​కర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ​ అవార్డులను మంత్రి శ్రీనివాస్​గౌడ్ అందుకున్నారు. బెస్ట్ స్టేట్ కాంప్రహెన్సివ్ డెవలప్​మెంట్​ ఆఫ్​ టూరిజం (పర్యాటక రంగంలో సమగ్రాభివృద్ధి) విభాగంలో తెలంగాణకు మూడో స్థానం దక్కింది. బెస్ట్ టూరిస్ట్ రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిలిచింది. హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ కు ఉత్తమ పర్యాటక గోల్ఫ్ కోర్స్ గా, హైదరాబాద్ లోని అపోలో హెల్త్ సిటీకి ‘బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ’ అవార్డు దక్కాయి. రాష్ట్ర పర్యాటక శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.

డెవలప్​మెంట్​ను అడ్డుకోలేరు: శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతీయ స్థాయిలో ‘సమగ్రాభివృద్ధి బెస్ట్ టూరిజం’ విభాగంలో మూడో స్థానం దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధిలో తెలంగాణ ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. దేశానికి పేరుతెస్తున్న తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు సరికాదన్నారు. తెలంగాణ భవన్​లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లోనూ మంత్రి పాల్గొన్నారు.