
- భూముల ఆక్రమణలపై సర్కారు సీరియస్
- ఒక్క ఏడాదిలోనే 668 కేసుల నమోదు
- నేతలు సహా 1,698 మందిపై ఫిర్యాదులు
- గిరిజనులపై నాన్ బెయిలబుల్, అధికార పార్టీ నేతలపై బెయిలబుల్ కేసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పక్కకు పెట్టిన సర్కారు.. అటవీ భూముల ఆక్రమణలపై మాత్రం ఉక్కుపాదం మోపింది. గత ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి 1,698 మందిపై 668 కేసులు నమోదు చేసింది. ఇందులో చాలా మంది ప్రజాప్రతినిధులు.. ప్రధానంగా అధికార పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడితో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణపైనా కేసులు నమోదు చేశారు.అడవులను సంరక్షించేందుకు అవసరమైతే మరింత కఠిన చట్టాలు తీసుకు వస్తామని సీఎం కేసీఆర్పలుమార్లు అధికారుల సమీక్షలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పోడు భూముల వివాదం ముదరడం, దాడులు, నమోదవుతున్న కేసులు రాష్ట్రంలో అలజడి రేపుతున్నాయి.
ఐదేళ్లలో 6,737 మందిపై కేసులు
అటవీ శాఖ రికార్డుల ప్రకారం ఏటా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక గత ఐదేండ్లలో వివిధ జిల్లాల పరిధిలోని 13,860 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఇందుకు సంబంధించి 6,737 మందికి ప్రమేయమున్నట్టుగా పేర్కొంటూ 1,980 కేసులు నమోదు చేసింది. ఇందులో గత ఒక్క ఏడాదిలోనే 668 కేసులు ఉండటం గమనార్హం. ఐదేళ్లతో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే కేసుల సంఖ్య బాగా పెరిగింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే బాధ్యతను అటవీ శాఖకు అప్పగించిన తర్వాతే ఆక్రమణలపై ఫోకస్ పెరిగిందని, అందులో భాగంగానే సర్కారు కఠిన చర్యలు చేపడుతోందని అంటున్నారు. అయితే అధికార పార్టీ నేతల ప్రమేయమున్న చోట బెయిలబుల్ కేసులు పెడుతున్న పోలీసులు.. గిరిజనుల ప్రమేయమున్న చోట మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్నే ళ్లుగా ఆక్రమణకు గురైన భూమి, కేసుల తీరు
ఏడాది కేసుల సంఖ్య ఆక్రమించిన భూమి (హెక్టార్లలో) కేసులు నమోదైనవారు
2014- 15 421 940.7 1,171
2015-16 192 872.4 988
2016-17 321 1242.8 1,625
2017-18 378 1057.3 1,255
2018-19 668 1430.6 1,698
మొత్తం_ 1,980 5,544.0 6,737