తెలంగాణకు 16 ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు

తెలంగాణకు 16 ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు

ఢిల్లీ : తెలంగాణలోని మున్సిపాలిటీలు  ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డుల పంటను పండించాయి. మొత్తం 16 మున్సిపాలిటీలు ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పట్టికలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో జరిగిన  ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా మంత్రి  కేటీఆర్, కార్పొరేటర్లు అవార్డులను అందుకున్నారు. తెలంగాణకు అవార్డులు దక్కడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కార మార్గాల గుర్తింపు, చెత్తరహిత నగరాల సాధన, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా 4,355  పట్టణ స్థానిక సంస్థలకు 2021 జూలై  నుంచి 2022 జ‌న‌వ‌రి మధ్యకాలంలో స్టార్ రేటింగ్ ఇచ్చారు. అత్యుత్తమ రేటింగ్ పొందిన మున్సిపాలిటీలనే ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులకు ఎంపిక చేశారు. ఇందుకోసం మొత్తం 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈవివరాలను తెలుపుతూ మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అవార్డులు సాధించిన మున్సిపాలిటీలకు అభినందనలు తెలిపారు. 


 
అవార్డు అందుకున్న 16 మున్సిపాలిటీలివే..
 
1.ఆదిభట్ల మున్సిపాలిటీ
2. బడంగ్‌పేట్ మున్సిపాలిటీ
3. భూత్పూర్ మున్సిపాలిటీ
4. చండూర్ మున్సిపాలిటీ
5. చిట్యాల మున్సిపాలిటీ
6. గ‌జ్వేల్ మున్సిపాలిటీ
7. ఘ‌ట్ కేస‌ర్ మున్సిపాలిటీ
8. హుస్నాబాద్ మున్సిపాలిటీ
9. కొంప‌ల్లి మున్సిపాలిటీ
10. కోరుట్ల మున్సిపాలిటీ
11. కొత్తపల్లి మున్సిపాలిటీ
12.నేరేడుచ‌ర్ల మున్సిపాలిటీ
13. సికింద్రాబాద్ కంటోన్మెంట్
14. సిరిసిల్ల మున్సిపాలిటీ
15. తుర్కయంజాల్ మున్సిపాలిటీ
16. వేముల‌వాడ మున్సిపాలిటీ