సీఆర్ఎంపీ రోడ్లపై సర్కార్ ఫోకస్

సీఆర్ఎంపీ రోడ్లపై సర్కార్ ఫోకస్
  • మరో ఏడాది మాత్రమే ఏజెన్సీల అగ్రిమెంట్ గడువు  
  • నాలుగేండ్లుగా ఫుట్  పాత్ ల నిర్మాణాలు పూర్తి చేయలే 
  • రోడ్లపై గుంతలు కనిపించినా చర్యలు తీసుకోలే 
  • నిధులను వృథా చేయడంతో అధికారుల నిర్ణయం
  • సొంతగా మెయింటెనెన్స్ కు బల్దియా ప్లాన్

హైదరాబాద్, వెలుగు : సిటీలో రోడ్లను కాంప్రెహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం(-సీఆర్ఎంపీ) కింద ఏజెన్సీలకు ఐదేండ్ల అగ్రిమెంట్ పై జీహెచ్ఎంసీ అప్పగించింది. మరో ఏడాది గడువు ఉంది. అయితే.. రోడ్ల మెయింటెనెన్స్ ను ఏజెన్సీలు సరిగా పట్టించుకోలేదు. నాలుగేండ్లుగా రోడ్ల నిర్వహణలో లోపాలు జరిగాయని, పనులు చేయకుండానే కోట్లాది నిధులు ఖర్చు చేశారని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది.  సీఆర్ఎంపీలో జరిగిన పనులు, ఏజెన్సీలకు చేసిన చెల్లింపులపై విచారించేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిసింది.  2020లో  కరోనా సమయంలో సిటీలోని మెయిన్ రోడ్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 811.9 కి. మీ మేర రోడ్ల మెయింటెనెన్స్ ను గత ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టింది. 

ఇందుకు ప్రతి ఏటా రూ.400 కోట్ల చొప్పున అగ్రిమెంట్ మేరకు 5 ఏండ్ల పాటు చెల్లించాలి. ఏడాదికి ఒక్క కిలోమీటరుకు రూ.50 లక్షల చొప్పున బల్దియా ఖర్చు చేస్తుంది. ఏటా నిధులను కూడా ఏజెన్సీలకు అందిస్తుంది. అగ్రిమెంట్ మేరకు ఏజెన్సీలు పనులు సక్రమంగా చేయకపోవడంతో నిధులన్నీ వృథా అయ్యాయి. దీంతో గడువు పూర్తికాగానే బల్దియానే స్వయంగా రోడ్ల మెయింటెనెన్స్ తీసుకోనున్నట్టు తెలిసింది. 

నిర్వహణను పట్టించుకోలే.. 

 రోడ్ల సెంటర్ మీడియన్లలో గ్రీనరీ డెవలప్ మెంట్, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం, ఫుట్ పాత్ ల నిర్మాణం వంటి పనులను అగ్రిమెంట్ మేరకు ఏజెన్సీలు చేపట్టాలి. కానీ మెయిన్ రోడ్లలో కూడా ఫుట్ పాత్ ల నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో చాలా ఏరియాల్లో జనాలు రోడ్లపైనే నడుస్తున్నారు. గ్రీనరీ డెవలప్ మెంట్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. మెయిన్ రోడ్లపై కార్మికులకు ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలు జరగకుండా స్వీపింగ్ మెషీన్ల ద్వారా రోడ్లను ఊడ్చాల్సి ఉంది. అయినా అధికారులు పట్టించుకోకుండా కార్మికులతోనే మళ్లీ రోడ్లు క్లీన్ చేయిస్తున్నారు.

ఏజెన్సీలు ఇవే.. 

ఎల్​బీనగర్,-కాప్రా, ఉప్పల్, హిమాయత్ నగర్, సరూర్ నగర్, చార్మినార్,- మలక్ పేట్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్టలోని రోడ్లను బీఎస్​సీపీఎల్ ఇన్ ఫ్రా సంస్థ, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్ పరిధిలోని రోడ్లను  ఎం. వెంకటరావు ఇన్ ఫ్రాకు, ఖైరతాబాద్-– 1,  మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, సికింద్రాబాద్, బేగంపేట్ ప్రాంతాల్లోని రోడ్లను కేఎన్ఆర్ కన్​స్ర్టక్షన్ లిమిటెడ్ కు, ఖైరతాబాద్–-2/ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, యూసఫ్ గూడ, శేరిలింగంపల్లి, గాజుల రామారం, అల్వాల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట, మల్కాజిగిరి ప్రాంతాల్లోని రోడ్లను మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాకు, చందానగర్, ఆర్సీపురం, పటాన్ చెరు, కూకట్ పల్లి, మూసాపేట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లోని రోడ్లను ఎన్​సీసీ లిమిటెడ్ ఏజెన్సీలకు బల్దియా అప్పగించింది. ఆయా రోడ్లపై ఎక్కడైనా డ్యామెజ్ అయితే వేరే ఏదైనా సమస్యలుంటే కాల్ చేసేందుకు ఫోన్ నంబర్లతో  బోర్డులు ఏర్పాటు చేశారు. ఏదైనా రోడ్ల ప్రాబ్లమ్ పై ఆయా ఏజెన్సీల నంబర్లకు కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. కొన్నిచోట్ల ఫోన్ చేసినా లిఫ్ట్ కూడా చేయడంలేదు.  

 సర్కార్ సైతం ఫోకస్ 

నాలుగేండ్ల పాటు ఏజెన్సీలు సరిగా పనులు చేయకపోగా.. ప్రస్తుత ప్రభుత్వం దృష్టిపెట్టింది. సీఆర్ఎంపీలో జరిగిన పనులు, ఏజెన్సీలకు చేసిన చెల్లింపులపై విచారించేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిసింది.  సిటీలో ఆరు జోన్లలో మొత్తంగా ఐదు ఏజెన్సీలకు రోడ్ల మెయింటినెన్స్ గత ప్రభుత్వం అప్పగించింది. ఏజెన్సీలకు అప్పగించిన  తర్వాత ఏయే పనులు చేశారనే దానిపై ప్రస్తుతం ఆ రోడ్ల పరిస్థితి ఎలా ఉందనే అంశంపైనా రాష్ట్ర సర్కార్ వివరాలు సేకరించనున్నట్టు తెలిసింది.