మేం బోర్డు మీటింగ్‌లకు రాలేం

మేం బోర్డు మీటింగ్‌లకు రాలేం
  • మేం కోర్టుల్లో కేసుల విచారణకు వెళ్లాల్సి ఉంది
  • ఇంకో రోజుకు సమావేశాలు వాయిదా వేయండి
  • కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ లెటర్​
  • మీటింగ్​లకు వస్తామన్న ఏపీ అధికారులు

హైదరాబాద్‌, వెలుగు: కోర్టుల్లో కేసుల విచారణలు, పలు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన కమిట్‌మెంట్స్‌ ఉండటంతో సోమవారం నిర్వహించే కృష్ణా, గోదావరి  బోర్డుల మీటింగ్‌లకు తాము రాలేమని తెలంగాణ సర్కారు మరోసారి తెలిపింది. ఈ మేరకు ఇరిగేషన్‌  స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ ఆదివారం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ చైర్మన్లు ఎంపీ సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌కు వేర్వేరుగా లెటర్లు రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు తాము వెళ్లాల్సి ఉన్నందున ఇంకో రోజు బోర్డుల సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. బోర్డుల సమావేశాల ఎజెండాలో కేవలం అడ్మినిస్ట్రేటివ్‌ అంశాలను మాత్రమే పేర్కొన్నారని, తాము పంపిన ఎజెండాను కూడా చేర్చాలన్నారు. కృష్ణా నీళ్ల వినియోగం, వాటాలపైనా చర్చించాలని డిమాండ్‌ చేశారు.

మొన్న కూడా డుమ్మా
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జులై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీని అమలుకు 30 రోజుల్లోగా ఆర్గనైజేషనల్‌ స్ట్రక్చర్‌ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు బోర్డులు ఈ నెల 3న కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించాయి. ఈ మీటింగ్‌కు తెలంగాణ హాజరుకాలేదు. దీంతో ఫుల్‌ బోర్డు మీటింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేసింది. తెలంగాణ కోరినట్టుగానే రెండు బోర్డులు సోమవారం సమావేశాలు పెడుతున్నట్టు గతంలోనే సమాచారమిచ్చాయి. తాము ఈ మీటింగ్‌కు హాజరుకాలేమని తెలంగాణ ఇంతకుముందే లేఖ రాసింది. కేంద్రం పెట్టిన 30 రోజుల గడువు ముంచుకొస్తున్నందున ఎలాగైనా వీలు చేసుకొని సమావేశానికి రావాలని రెండు బోర్డులు కోరాయి. అయినా సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ సర్కారు తేల్చిచెప్పింది. మరోవైపు ఏపీ అధికారులు సోమవారం నిర్వహించే సమావేశానికి హాజరవుతున్నట్టు బోర్డులకు సమాచారం ఇచ్చారు.