కేయూ పీహెచ్ డీ అడ్మిషన్ల .. అక్రమాలపై విచారణ

కేయూ పీహెచ్ డీ అడ్మిషన్ల .. అక్రమాలపై విచారణ
  • స్టూడెంట్లు, వీసీతో చర్చించిన కౌన్సిల్ చైర్మన్ 

హైదరాబాద్, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్​డీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలపై సర్కారు, విద్యాశాఖ దృష్టి సారించింది. వారం రోజుల క్రితం వరంగల్ పర్యటనలో మంత్రి కేటీఆర్​కు స్టూడెంట్లు ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ జరపాలని విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణను ఆదేశించారు.  ఆమె ఆ బాధ్యతను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రికి అప్పగించారు. ఆయన మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ గోపాల్ రెడ్డితో కలిసి మంగళవారం కేయూ విద్యార్థులతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో సమావేశమయ్యారు.

ఆరోపణలపై ఆధారాలు తీసుకున్నారు. బుధవారం కేయూ వీసీ తాటికొండ రమేశ్​ను పిలి పించి మాట్లాడారు. స్టూడెంట్ల ఆరోపణలు, పీహెచ్​డీ అడ్మిషన్ల ప్రక్రియలో అనుసరించిన విధానాలపై వివరాలు సేకరించారు. బుధవారం సాయంత్రం విద్యాశాఖ సెక్రటరీకి లింబాద్రి రిపోర్ట్​ అందించారు. అయితే పీహెచ్​డీ అడ్మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని విద్యాశాఖ ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.