
- ప్రభుత్వ అంగీకార పత్రం అందించిన ఎనర్జీ డిప్యూటీ సెక్రటరీ
- సదరన్ డిస్కం ఏఆర్ఆర్పై ఈఆర్సీ బహిరంగ విచారణ
- విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గాయి: సదరన్ డిస్కం సీఎండీ
- కరెంట్ షాక్ మరణాలు పెరుగుతున్నయి.. ప్రమాదాలపై రిపోర్ట్ ఇవ్వాల్సిందే: ఈఆర్సీ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: కరెంట్ చార్జీలను పెంచడం లేదని రాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. డిస్కంల లోటును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చింది. దీంతో సామాన్యులపై కరెంట్ చార్జీల భారం తప్పినట్లయింది. శుక్రవారం హైదరాబాద్‌లోని విద్యుత్ నియంత్రణ భవన్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ ఆధ్వర్యంలో ఎస్పీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ చట్టం 2003లోని 65వ నియమంలోని నిబంధనల ప్రకారం తెలంగాణ విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థిక మద్దతును సమకూర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రియదర్శిని తెలియజేశారు.
2025-–26లో వినియోగదారులకు టారిఫ్ లో ఎలాంటి పెరుగుదల ఉండబోదన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన హామీ రావడంతో విద్యుత్ చార్జీలు పెంచడం లేదని డిస్కంలు కూడా క్లారిటీ ఇచ్చాయి. ఇప్పటికే చార్జీల పెంపు ప్రతిపాదన లేదని నార్తర్న్ డిస్కం స్పష్టం చేయగా, తాజాగా శుక్రవారం ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీ కూడా కరెంట్ చార్జీల పెంపు లేదని ప్రకటన చేశారు.
నష్టాలు తగ్గాయి: సదరన్ డిస్కం సీఎండీ
విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గాయని సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఈఆర్సీ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో కరెంట్ పీక్ డిమాండ్17,162 మెగావాట్లకు చేరుకుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో పవర్ స్వాప్ అగ్రిమెంట్లు చేసుకున్నామని, వీటి ద్వారా ఎస్పీడీసీఎల్ కు రూ.1,614 కోట్లు ఆదా అవుతోందని చెప్పారు.
డిస్కం పరిధిలో రూ.578.88 కోట్లతో నెట్ వర్క్ బలోపేతం చేశామని, ఫలితంగా విద్యుత్ పంపిణీ నష్టాలు 8.38 శాతానికి తగ్గాయన్నారు. పవర్ పర్చేస్ కాస్ట్ రూ.5.76కు తగ్గించినట్లు కమిషన్‌కు వివరించారు. పీటీఆర్ ఫెయిల్యూర్స్ రేట్ ను 1.55 శాతానికి, డీటీఆర్ ఫెయిల్యూర్స్ రేట్ ను 5.70 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ యూనిట్ సరాసరి రేటు రూ.3.53గా వున్నదని, మున్ముందు రూ.2కే అందుబాటులోకి వస్తుందన్నారు.
గృహజ్యోతి పథకం ద్వారా ఇస్తున్న విద్యుత్కు ప్రభుత్వం నుంచి సబ్సిడీ నిధులు వసూలు చేస్తామన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం10:30 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య సీఈల అధ్యక్షతన ప్రతి సర్కిల్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రైతుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. కాగా, సదరన్ డిస్కంకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రూ.46,035 కోట్ల రెవెన్యూ అవసరాలు ఉండగా, ప్రస్తుత టారిఫ్ ల ద్వారా రూ.36,220 కోట్లు రెవెన్యూ వస్తోంది. ఇవికాకుండా క్రాస్ సబ్సిడీ సర్ చార్జీతో రూ.37 కోట్లు, అడిషనల్ సర్ చార్జీతో రూ.20 కోట్ల రెవెన్యూ వస్తోంది. అయినప్పటికీ రెవెన్యూ గ్యాప్ రూ.9,758 కోట్లుగా ఉండనుంది. ఈ రెవెన్యూ గ్యాప్ ను ప్రభుత్వమే సబ్సిడీ ద్వారా భర్తీచేయనుంది.
రైతులకు నష్టపరిహారం అందట్లే..
బహిరంగ విచారణలో రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. కరెంట్ సరఫరా సమస్యలు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, కరెంట్ షాక్ తో రైతుల మరణాలు, మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం తదితర అంశాలను ఈఆర్సీ చైర్మన్ కు వివరించారు. విద్యుత్ షాక్ తో చనిపోయిన రైతులకు నష్టపరిహారం సకాలంలో అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయ రహదారులపై విద్యుత్ బల్బులు ఉండడంలేదని, దాని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ రంగ నిపుణుడు ఎం వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. ఏఆర్ఆర్ రిపోర్టులు ఇవ్వడంలో డిస్కంలు ఏటా లేట్ చేస్తున్నాయని చెప్పారు. సోలార్ ఎనర్జీ వాడకం పెంచుకోవాలనుకున్నా స్టోరేజీ కాస్ట్ ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. విద్యుత్ సంస్థల్లో కరెంట్ ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు 24 గంటల ఉచిత కరెంట్ అడగడం లేదని, అంత అవసరం కూడా ఉండదన్నారు.
ప్రమాదాలపై రిపోర్ట్ ఇవ్వాల్సిందే: ఈఆర్సీ చైర్మన్
బహిరంగ విచారణలో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదం ఎలా జరిగింది? ఎలా మరణించారు? అనే వివరాలను నివేదికల్లో తప్పనిసరిగా మెన్షన్ చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. ప్రమాదం సంస్థ నిర్లక్ష్యంతో జరిగిందా? ఉద్యోగి నిర్లక్ష్యంతో జరిగిందా? అనేది తెలియాలని స్పష్టం చేశారు. ఏఆర్ఆర్ పై డిస్కంల జాప్యంపై స్పందిస్తూ ఏఆర్ఆర్ ను స్టడీ చేసి సబ్మిట్ చేయడంలో ఈసారి ఆలస్యమైందన్నారు. పీక్ హవర్స్ లో కరెంట్ కొనుగోలు రేటు చాలా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని సదరన్ డిస్కం అధికారులు మిస్ అయినట్లున్నారని తెలిపారు. 2030 నాటికి కేంద్ర ప్రభుత్వం 30 శాతం సోలార్ విద్యుత్ను వినియోగించాలని భావిస్తోందని తెలిపారు.
అప్పటికప్పుడే చెక్ అందజేశారు
బహిరంగ విచారణలో పాల్గొన్న చిన్నయ్యగారి సరిత మాట్లాడుతూ.. తన భర్త సంజీవ రెడ్డి 2019 లోకరెంట్ షాక్‌తో చనిపోయారని, పరిహారం ఇప్పటికీ రాలేదని ఈఆర్సీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అప్పటికప్పడు ఫైల్ ను ప్రాసెస్ చేసి 5 లక్షల పరిహారాన్ని విడుదల చేస్తూ చైర్మన్ చేతుల మీదుగా చెక్‌ను అందించారు. బహిరంగ విచారణలో ఎస్పీడీసీఎల్ జేఎండీ శ్రీనివాస రావు, రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, విద్యుత్ రంగ సంస్థల అధికారులు, రైతులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.