ఇట్స్ అఫిషియల్: మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

ఇట్స్ అఫిషియల్: మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

హైదరాబాద్: తెలంగాణలో ఒంటి పూట బడులపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకూ తెలంగాణలోని పాఠశాలల్లో ఒంటిపూట బడుల విధానం అమల్లోకి వస్తుందని తెలంగాణ విద్యా శాఖ గురువారం(మార్చి 13, 2025) సర్క్యులర్ జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు జరుగుతాయని, 12.30కు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెడతారని విద్యా శాఖ స్పష్టం చేసింది. టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్న క్రమంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని తెలిపింది.

టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కు సెంటర్స్గా కేటాయించిన స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు జరుగుతాయని విద్యా శాఖ వెల్లడించింది. సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో మధ్యాహ్నం12.30 గంటలకు పిల్లలకు మిడ్​డే మీల్స్ పెట్టి, ఇంటికి పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే, టెన్త్ పబ్లిక్ పరీక్షలు కొనసాగే బడుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని సూచించారు. 

ఏప్రిల్, మే నెలల్లో మాములుగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ మార్చి రెండో వారంలోనే 35 డిగ్రీలకు చేరుకొని ఆ తర్వాత 40కి అటు ఇటుగా నమోదవుతుంది. మార్చి 4న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మార్చి 1న 33 డిగ్రీలు, 2న 35 డిగ్రీలు, 3న మరో రెండు డిగ్రీలు పెరిగి 37కు చేరింది. 

మార్చి 4న ఏకంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాలుగు మండలాల్లో 38.03 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండలను దృష్టిలో ఉంచుకునే విద్యార్థులకు వీలైనంత త్వరగా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.