గుర్తింపే లేని సంఘానికి ఓడీ

గుర్తింపే లేని  సంఘానికి  ఓడీ

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కుల సంఘాలకు సర్కారు ప్రాధాన్యత పెంచింది. దీంట్లో భాగంగా సర్కారు గుర్తింపులేని ఒక కులానికి సంబంధించిన టీచర్ సంఘానికి కూడా అదర్ డ్యూటీ (ఓడీ) సౌకర్యం కల్పించింది. ఈ ఏడాది జనవరి1 నుంచి డిసెంబర్ 31 వరకూ తెలంగాణ గిరి జన ఉపాధ్యాయ సంఘం (టీజీయూఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు టెంపరరీ ఓడీ సౌకర్యం ఇస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. అయితే, రాష్ట్రంలో పీఆర్టీయూ, టీఎస్ యూటీఎఫ్, ఎస్టీయూటీఎస్, టీఆర్టీఎఫ్ సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​లో శాశ్వత సభ్యత్వం ఉంది. 

దీంతో పాటు టీపీటీఎఫ్, హెచ్ఎం అసోసియేషన్, తపస్, ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ టీచర్ సంఘాలకు సర్కారు గుర్తింపు ఉంది. రాష్ట్రంలో ఈ 8 సంఘాలకు మాత్రమే సర్కారు అధికారిక గుర్తింపు లభించింది. అయితే, గతేడాది పీఆర్టీయూతో పాటు యూటీఎఫ్, ఎస్టీయూ, టీఆర్టీఎఫ్, టీపీటీఎఫ్ సంఘాలతో పాటు టీపీఆర్టీయూ, టీయూటీఎఫ్, టీటీయూ, ఆర్​యూపీపీ  తదితర సంఘాలకూ ఓడీ ఫెసిలిటీ ఇచ్చారు. ఈ ఏడాది కేవలం పీఆర్టీయూకు మాత్రమే ఓడీ సౌకర్యం కల్పించింది. ఓడీ సౌకర్యం ఇవ్వాలంటే కనీసం రాష్ట్రంలోని మొత్తం టీచర్లలో 15 శాతం నుంచి 20 శాతం వరకూ మెం బర్ షిప్ ఉండాలి. సర్కారు దీన్ని పట్టించుకోకపోవడంపై  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.