వాయిదాపడ్డ ఫార్మసీ పరీక్షల నిర్వహణకు సర్కారు గ్రీన్ సిగ్నల్

వాయిదాపడ్డ ఫార్మసీ  పరీక్షల నిర్వహణకు  సర్కారు గ్రీన్ సిగ్నల్
  • ప్రపోజల్స్ పంపాలని జేఎన్‌‌టీయూకు శ్రీదేవసేన ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌మెంట్ల సమ్మె కారణంగా వాయిదా పడిన జేఎన్‌‌టీయూ ఫార్మసీ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం విద్యాశాఖ ఇన్‌‌చార్జి సెక్రటరీ శ్రీదేవసేనను ఉన్నత విద్యా కళాశాలల సమాఖ్య (ఫతీ) ప్రతినిధులు పి.రమేశ్ బాబు తదితరులు కలిశారు. స్కాలర్‌‌షిప్ బకాయిలపై ఈ నెల 3 నుంచి ప్రైవేట్ కాలేజీలు సమ్మె చేయడంతో 4, 6 తేదీల్లో జరిగిన అనాటమీ, కెమిస్ట్రీ పరీక్షలకు 7 వేలకు పైగా విద్యార్థులు హాజరుకాలేదని వివరించారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. దీనికి శ్రీదేవసేన సానుకూలంగా స్పందించారు. వెంటనే జేఎన్‌‌టీయూ రెక్టార్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లుతో చర్చించి, వాయిదా పడిన రెండు పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు ఫైల్ పంపాలని అధికారులను ఆదేశించారు.