అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల

అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల
  •     నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
  •     మంత్రి తుమ్మల వెల్లడి
  •     పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంట నష్టం వివరాలను సేకరించాలని తెలిపారు. 

మార్కెట్ యార్డులకు తీసుకొచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి నష్టం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. గోదాములు, తాత్కాలిక నిల్వ సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.