ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్‌

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్‌
  • డిజాస్టర్‌‌ అండ్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌ తెచ్చిన రాష్ట్ర సర్కార్‌‌
  • ఆమోదించిన గవర్నర్‌‌

హైదరాబాద్‌: విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాల్లో పాక్షికంగా, పూర్తిగా కోత విధించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డిజాస్టర్‌‌ అండ్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ పెన్షన్‌దారులకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్‌ దారులకు 25 శాతం కోత విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పెన్షన్‌ దారులు గతంలో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వం జీతాలు, పెన్షలలో కోత విధిస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ మేరకు గవర్నర్‌‌ ఆమోదంతో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ఇప్పటి వరకు ఉద్యోగస్థులు, పెన్షన్‌దారులకు కోత విధించిన మొత్తాన్ని చెల్లించాలా అనే అంశంపై ప్రభుత్వం 6 నెలల లోపు నోటిఫికేషన్‌ విడుదల చేసి తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదని పెన్షన్‌ దారుల తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న లాయర్‌‌ చిక్కుడ ప్రభాకర్‌‌ అన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత అన్ని కార్యకలాపాలు నడుస్తున్నాయని, ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ ఈ రకంగా పెన్షన్‌ దారులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పిటికే వేసిన పిటిషన్‌లో ఈ ఆర్డినెన్స్‌ను చాలెంజ్‌ చేస్తూ అమెండ్‌మెంట్‌ చేస్తామని అన్నారు. చట్ట పరిధిలోని, రాజ్యాంగ పరిధిలో, దేశ సర్వోన్నత న్యాయస్థాన పరిధిలో ఇలాంటి ఆర్డినెన్స్‌ లేదని వాదనలు వినిపించామని, దాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 24న దీనిపై వాదనలు వింటామని చెప్పారని అన్నారు. ఆర్డినెన్స్‌ను కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తామని ప్రభాకర్‌‌ మీడియాతో చెప్పారు.