శబరి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మంచిర్యాలకు జిల్లాకు చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి

శబరి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మంచిర్యాలకు జిల్లాకు చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి

మంచిర్యాల: శబరి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంచిర్యాలకు చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. పాలకుర్తి సత్యనారాయణ, ( 63) రమా (59) దంపతులు లక్షెట్టిపేట పట్టణంలో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. జనవరి 8న దంపతులిద్దరూ అయ్యప్ప మాలలో ఓ ప్రైవేట్ సర్వీస్‎లో శబరిమల దర్శనానికి వెళ్లారు.

జనవరి 15న మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ప్రైవేట్ టూరిస్ట్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కన్యాకుమారి దగ్గర బైపాస్ రోడ్‎లో బస్సును ఆపారు. అక్కడ సముద్ర స్నానం, దేవాలయాలు సందర్శించుకుని బస్సు దగ్గరకు వస్తుండగా సత్యనారాయణ, రమ దంపతులను ఓ వాహనం ఢీకొట్టింది. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కన్యాకుమారి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దంపతులు ఇద్దరూ ఒకేసారి మృతి చెందటంతో సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.