బైపోల్​ లేట్​ : దళిత బంధు స్లో

బైపోల్​ లేట్​ : దళిత బంధు  స్లో
  • ప్రతి యూనిట్‌‌కు డీపీఆర్​.. కంపెనీలకే పైసలు ట్రాన్స్‌‌ఫర్​ 
  • హుజూరాబాద్​లో స్కీం అమలుకు సర్కారు బ్రేకులు
  • వెంటనే అమలు చేస్తే ఎన్నికల్లో ఫాయిదా ఉండదని ఆలోచన
  • రెండు నెలలపాటుకొనసాగించాలని ప్లాన్​
  • లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు ఫ్రీజింగ్​
  • ప్రతి యూనిట్‌‌కు డిటైల్డ్‌‌ ప్రాజెక్టు రిపోర్ట్​ మస్ట్‌‌
  • మొత్తం 21 వేల డీపీఆర్‌‌లు ఫైనల్​ అయ్యాకే యూనిట్లు మంజూరు

దళిత  బంధు కింద 47 రకాల వ్యాపారాలు  చేసుకునే వీలుంటుందని ఇప్పటికే ప్రభుత్వం లిస్టు రెడీ చేసింది. వాటిలో ఎంచుకున్న యూనిట్​ను మంజూరు చేస్తుంది. ఒకే గ్రామంలో అందరూ ఒకే బిజినెస్​ చేస్తే లాభం ఉండదని.. లబ్ధిదారులు వేర్వేరు బిజినెస్​లు  ఎంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పైగా ఒక్కో యూనిట్‌కు డిటైల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్టు (డీపీఆర్) ఉండాలనే నిబంధన తెచ్చింది. 21 వేల యూనిట్లలో ప్రతి యూనిట్​కు ఒక డీపీఆర్​ ఇవ్వాల్సి ఉంటుంది. నియోజక వర్గంలో మొత్తం డీపీఆర్​లు  ఫైనల్​ అయ్యాకే  యూనిట్లను మంజూరు చేస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోని డబ్బును కూడా ఎంచుకునే వ్యాపారానికి తగ్గట్టుగా నేరుగా కంపెనీలకు ట్రాన్స్​ఫర్​ చేయనున్నారు. 


హుజూరాబాద్​లో దళిత బంధు లబ్ధిదారులందరికీ ప్రభుత్వమే  బ్యాంకుల్లో సపరేట్ అకౌంట్లు ఓపెన్ చేయించింది. వాటి బ్యాంకు పాసు పుస్తకాలేవీ లబ్ధిదారులకు ఇవ్వలేదు. అకౌంట్​హోల్డర్​ ఫోన్​ నంబర్‌కు డబ్బులు జమ అయినట్లు మెసేజ్​లు వస్తున్నాయి. కలెక్టర్ అకౌంట్‌ నుంచి రూ. 9.90 లక్షల చొప్పున జమ చేస్తున్నారు. మిగిలిన రూ. పది వేలు రక్షణ నిధికి కేటాయిస్తున్నారు. మొన్నామధ్య నలుగురైదుగురికి కార్లు, ఆటోలు, ట్రాక్టర్ల యూనిట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు స్కీంను ఆలస్యం చేయడంలో భాగంగా కొత్త నిబంధనలను ముందుకు తెచ్చింది. డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో ఉంటాయి  కానీ, వాటిని వాళ్లు తీసుకోకుండా ఫ్రీజ్ చేసింది. 

హైదరాబాద్, వెలుగు : హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక ఇప్పట్లో లేకపోవడంతో అక్కడ దళిత బంధు అమలును రాష్ట్ర సర్కారు స్లో చేసింది. కొందరు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసినా.. వాటిని విత్‌‌డ్రా చేసుకోకుండా అకౌంట్లను ఫ్రీజ్​ చేసింది. ఇప్పుడే  స్కీం అమలు చేస్తే ఉప ఎన్నిక నాటికి లబ్ధిదారులు మరిచిపోయే ప్రమాదముందని, ఫాయిదా ఉండదని సర్కారు భావిస్తోంది. అందుకే  ఈ స్కీంను కొంతకాలం మెల్లగా సాగదీయాలని ఆఫీసర్లకు ఇంటర్నల్​ ఆదేశాలు జారీ చేసింది. దీపావళి తర్వాతే  బైపోల్‌‌ నిర్వహించే చాన్స్​ ఉండటంతో అప్పటిదాకా స్కీం ప్రాసెస్​ను కొనసాగించేలా ప్లాన్​ చేసుకోవాలని సూచించింది.  హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలో  దాదాపు 21 వేలకు పైగా దళిత కుటుంబాలున్నాయి.  ఇంటింటికీ రూ.10 లక్షల చొప్పున సాయమందించడానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. 2 వేల కోట్లు రిలీజ్‌‌ చేసింది. లబ్ధిదారులతో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించింది.  మొదటి దశలో ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా వారి ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పటికి దాదాపు 8 వేల మంది ఖాతాల్లో రూ. 9.90 లక్షల చొప్పున డబ్బులు జమ చేశారు. అయితే హుజూరాబాద్​ బైపోల్ ​ఇప్పట్లో లేదని ఈసీ వెల్లడించడంతో.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కలెక్టర్‌‌ క్లియరెన్స్‌‌ ఇచ్చే వరకు డబ్బులను లబ్ధిదారులు తమ ఖాతాల నుంచి  విత్‌‌డ్రా చేయకుండా ఫ్రీజింగ్​ చేస్తూ అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. 
కొత్తగా ప్రాజెక్టు రిపోర్టు మెలిక
దళిత బంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్​ చెప్పినట్లు స్కీం డబ్బులతో తమకు తోచిన వ్యాపారం లేదా యూనిట్లను నెలకొల్పుకోవచ్చని ఎదురుచూస్తున్న దళిత కుటుంబాల ఆశలకు బ్రేక్​ పడింది. లబ్ధిదారులందరూ తాము చేసే వ్యాపారం లేదా  నెలకొల్పే  యూనిట్‌‌కు సంబంధించిన డిటైల్డ్‌‌ ప్రాజెక్టు రిపోర్ట్‌‌ (డీపీఆర్‌‌) రూపొందించాలని సర్కారు కొత్త నిబంధన పెట్టింది. ఈ లెక్కన మొత్తం 21 వేల  మంది లబ్ధిదారులకు సంబంధించిన  డీపీఆర్​లు తయారు చేయాల్సి ఉంటుంది. అవన్నీ తమకు అందిన తర్వాత..  అప్రూవల్‌‌ ఇవ్వాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు.  దీంతో హుజూరాబాద్‌‌లో స్కీం అమలు చేసేందుకు మరో  రెండు నెలలకు పైగా టైం పట్టే అవకాశముంది. 


 ఉప ఎన్నిక షెడ్యూల్‌‌ వచ్చేనాటికి తాము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం ఈ కొత్త మెలిక పెట్టిందనే అభిప్రాయాలున్నాయి. సీఎం కేసీఆర్‌‌ హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలోని శాలపల్లిలో ఆగస్టు 16న దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అదే వేదికపై 15 మందికి రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అయితే,  ఈ నెల మొదటివారంలోనే ఎన్నికల షెడ్యూల్‌‌ వస్తుందన్న ఆలోచనతో  పథకం అమలులో స్పీడ్​ చూపించిన సర్కారు.. ఇప్పుడు ఎలక్షన్​ వాయిదా పడటంతో రిలాక్స్​ అయింది. హుజూరాబాద్​కంటే ముందుగా దళిత బంధు అమలు చేసిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు ఇప్పటికీ యూనిట్లు  మంజూరు కాలేదు.