దశాబ్దిలోకి తెలంగాణ.. దశాబ్దపు అభివృద్ధి డొల్ల.. శతాబ్దపు దోపిడీ నిజం

దశాబ్దిలోకి తెలంగాణ.. దశాబ్దపు అభివృద్ధి డొల్ల.. శతాబ్దపు దోపిడీ నిజం

‘దశాబ్దిలో శతాబ్ది అభివృద్ధి’ జరిగిందని రాష్ట్ర సర్కారు పెద్దలు చెప్పుకుంటున్నరు. తొమ్మిదేండ్ల పాలనకే పదేండ్లు పూర్తయినట్లు ప్రచారం చేసుకుంటున్నరు. కానీ, వాళ్లు చెప్తున్నట్లు శతాబ్దపు అభివృద్ధి జరిగిందా? లేక దోపిడీ జరిగిందా?!  తెలంగాణ కోసం  కొట్లాడినం, తెచ్చుకున్నం. వచ్చినంక మంచి పాలన ఊహించినం. కానీ,  ఏడాది తిరిగే సరికల్లా, నిజస్వరూపం బయటపడింది. తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి అంతా డొల్ల. అన్ని రంగాల్లో అడుగడుగునా దోపిడీనే. ప్రధానంగా పది రంగాల్లో దోపిడీ నడుస్తున్నది. అది శతాబ్దపు దోపిడీ. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఏర్పడింది. ఆ పేరు చెప్పి.. ఇప్పుడు దోచుకుంటున్నరు. 

నీళ్లు :

ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు.. లక్ష కోట్లతో కట్టిన ఈ ప్రాజెక్టుతో కొత్తగా ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా? కేవలం కమీషన్ల కోసం కట్టినట్లుంది ఈ ప్రాజెక్టు. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. ప్రాజెక్టును చూడడానికి ప్రతిపక్షాలు వెళ్తే ఎందుకు రానివ్వడం లేదు. కాళేశ్వరంపై వస్తున్న ఆరోపణలను రుజువు చేసేందుకు రిటైర్డ్ జడ్జిలతోటి ఎంక్వైరీ జరిపించాలి. ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి. లేదంటే అక్కడ అక్రమం జరిగినట్టే అని ప్రజలు భావించాల్సి వస్తుంది. 

నిధులు:

ప్రతి రాష్ట్రానికి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు వస్తుంటాయి. తెలంగాణలో కూడా అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయన్నది వాస్తవం. ఆ నిధులు పక్కదారులు పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఎందుకు విచారణ జరిపించడం లేదు.

నియామకాలు:

ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని గత తొమ్మిదేండ్లుగా ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఆగమైపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఏ ఆకాంక్షల కోసం కొట్లాడి తెచ్చుకున్నమో ఆ రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రాణాలు వదలడం చాలా బాధాకరం. ఒక్క పోలీసు ఉద్యోగాలు తప్ప ఇప్పటివరకు ఏ డిపార్ట్​మెంట్​లోనైనా సక్కగా నియామకాలు జరిగాయా? ఎన్నికల ఏడాది కావడంతో నోటిఫికేషన్ల పేరు చెప్పి ఊరించారు. కానీ, అవి కూడా ఏమయ్యాయి? పేపర్ల లీకేజీలతో మళ్లీ మొదటికి తెచ్చారు. టీఎస్​పీఎస్సీపై అన్ని ఆరోపణలు వస్తున్నా.. సిట్​ వేసి చేతులు దులుపుకున్నారు. సమస్య ఎక్కడుందో గుర్తించే ప్రయత్నం చేయలేదు. 

భూమి:

అభివృద్ధి పేరిట వ్యవసాయ భూములు విధ్వంసానికి గురవుతున్నాయి. అన్నిటినీ మించి ధరణి పేరుతో పేద రైతుల పొట్ట కొడ్తున్నారు. అన్ని రకాల భూ సమస్యలకు ధరణి పరిష్కారమని చెప్తున్నారు కదా.. మరి జనం ఎందుకు ధరణి వల్ల తిప్పలు పడ్తున్నారో ఒక్కసారన్నా ఆలోచించారా? తాత్కాలికంగా భూముల రేట్లు పెంచి, పేద రైతులకు అందుబాటులో లేకుండా చేసి, వ్యవసాయానికి దూరం చేసే కుట్ర జరుగుతున్నది. ఇది నిజం కాదా?  

విద్య:

కేజీ టు పీజీ విద్య ఉచితంగా అమలు చేస్తామన్న హామీ ఎక్కడికి పోయింది?  తెలంగాణ రాకముందు ఆంధ్రా విద్యా సంస్థల్ని నిషేధిస్తాం అనే మాట మరిచిపోయారా? లక్షలకు లక్షలు డొనేషన్లతో ఫీజులు పెంచి సామాన్య విద్యార్థుల రక్తం తాగుతున్న ప్రైవేటు విద్యాసంస్థలతో కుమ్మక్కై విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారు. అన్నిటినీ మించి ఉద్యమ కాలంలో కాకతీయ,  ఉస్మానియా యూనివర్సిటీలు చేసిన సేవ మరిచిపోయి, ఉపాధ్యాయులు లేక వారి చదువును నిర్లక్ష్యం చేసింది నిజం కాదా?  ఏవో కారణాలు చెప్పి ప్రభుత్వ స్కూళ్లను బంద్​ పెడ్తున్నరు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నరు. 

వైద్యం:

ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీ పేట్రేగిపోతున్నది. ఇందుకు సాక్ష్యం కరోనా టైమ్​లో మనం ప్రత్యక్షంగా చూశాం. వాటిపై చర్యలు తీసుకున్నది లేదు. కనీసం కేంద్రం అమలు చేస్తున్న వైద్య విధానాలను కూడా ఇక్కడ అమలు చేయడం లేదు. ఆయుష్మాన్​ భారత్​ ఏమైంది? ఆరోగ్య శ్రీ పేరు చెప్పి.. ఆ పథకాన్ని ఇక్కడి ప్రజలకు అందకుండా చేస్తున్నరు. ప్రభుత్వ దవాఖాన్లలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో.. అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరికి తెలుసు. సరైన సౌలతులు లేక.. సిబ్బంది లేక.. పేషెంట్లు తిప్పలు పడ్తున్నారు.   

లిక్కర్​:

తెలంగాణ రాకముందు ఎంత ఆదాయం ఉండే? వచ్చినంక ఎంత ఆదాయం పెరిగింది? ప్రతి ఊరిలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు తెరిచి తాగుబోతులను చేస్తున్నరు. ఒక సర్వేలో తేలింది ఏమిటంటే.. దాదాపుగా ప్రతిరోజు ప్రతి ఊరులో లిక్కర్​ ద్వారా లక్ష రూపాయల ఆదాయం వస్తున్నదట. లిక్కర్​కు జనం బతుకులు బూడిదైతున్నయ్​. ఆమ్దానీ కోసం సర్కారు లిక్కర్​ అమ్మకాలు పెంచుతున్నది కానీ.. దాని ఫలితంగా జరుగుతున్న అనర్థాలను గమనించడం లేదు. 

పన్నులు:

ఇంటి పన్ను, బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు .. ఇట్లా ప్రతి ఒక్కటి పెంచేశారు. భూముల రిజిస్ట్రేషన్ పేరుతో టాక్స్ లు పెంచారు. వీటితో సామాన్య జనం అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్​పై ఇతర రాష్ట్రాల్లో రేట్లు ఎట్లున్నయ్​? మన రాష్ట్రంలో ఎట్లుంది? ఏమన్నా అంటే.. మేం రేట్లు పెంచలేదని ఇక్కడి ప్రభుత్వం చెప్తున్నది. కానీ, తగ్గించే అవకాశం ఉన్నా ఎందుకు తగ్గించడం లేదు? 

సినిమా, మీడియా:  

సినిమా రంగం నుంచి వచ్చే ఆదాయం అంతా ఇంతా కాదు. ఇది లెక్కలేని ఆదాయం. దాని గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సినీ తారల ప్రమేయం ఉన్న డ్రగ్స్ కేసు ఎటుపోయింది? ఒక నాడు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన ఆంధ్రా మీడియా సంస్థలకు ఇప్పుడు పండుగలు, పబ్బాల పేరిట రాష్ట్ర సర్కారు కోట్లకు కోట్ల అడ్వర్టయిజ్​మెంట్లు ఇస్తున్నది. వాటితో ఒరిగేది ఎవరికి? ఇతర రాష్ట్రాల్లో కూడా యాడ్స్​ ఇస్తూ ప్రచారం చేస్తున్నరు. ప్రజల సొమ్మును దోచిపెడ్తున్నరు. 

సహజ వనరులు:

తెలంగాణ రాష్ట్రం వచ్చాక సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. గుట్టల్ని విధ్వం సం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ గుట్టల విధ్వంసంతో పర్యావరణం దెబ్బతి ని భూములు బీడువారి పోతున్నాయి. గుట్టల విధ్వంసంతో కోతులు ఊర్ల మీద పడి, మను షుల మీద దాడి చేస్తున్నాయి. వాగులల్ల ఇసు కను ఇష్టారీతిగా తోడేస్తు న్నరు. పర్యావ రణా నికి భంగం కలిగిస్తు న్నారు. ఇలాంటి పరిస్థితే కొనసాగితే భవిష్యత్తు ఏమిటి? మైనింగ్ మాఫియాపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
‑ పడాల రాజమౌళి, పొలిటికల్​​ ఎనలిస్ట్​