
తమ సమస్యలు పరిష్కరించాలని వేలాది మంది బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఎండ, వానలను లెక్కచేయకుండా రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా.. సర్కారు పట్టించుకుంటలేదు. తాగునీరు, టాయిలెట్స్, కరెంట్, ల్యాప్ టాప్ లు, యూనీఫామ్లాంటి కనీస సౌలత్లు లేకుండా.. విద్యార్థుల సదువులెట్ల సాగుతాయనే స్పృహ సర్కారుకు లేకపోవడం చాలా ‘సిల్లీ’ అంశం!. ట్రిఫుల్ఐటీ విద్యార్థులది ఆందోళన మాత్రమే కాదు.. రాష్ట్రంలో సర్కారు విద్యా సంస్థల్లో సదువులు, సౌలత్ల తీరుపై మొదలైన ఉద్యమం కూడా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యా రంగ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
సర్కారు బడుల్లో ఒకవైపు వేల సంఖ్యలో విద్యార్థుల నమోదు పెరుగుతుండగా, పాఠశాల విద్యారంగాభివృద్ధిని సుషుప్తావస్థలోనెట్టిన ప్రభుత్వం.. తన బాధ్యతల్ని నిర్లక్ష్యం చేస్తోంది. అనేక సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, సౌకర్యాలను కోల్పోవటమే తప్ప ఈ ఎనిమిదేండ్లలో విద్యారంగానికి మిగిలిందేమీ లేదు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని పాలకులు ఇచ్చిన హామీలు నేటికీ అమలు కావడం లేదు.2014లో 14 శాతం ఉన్న విద్యా బడ్జెట్ నేడు 6.7 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి ప్రభుత్వం విద్యారంగ ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తోందని తెలుస్తోంది. సర్కారు బడులను బాగు చేసే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది అంటే.. క్రమంగా పేద పిల్లలు చదువుకు దూరమైతున్నట్లే లెక్క. పాలకులు ఉద్దేశపూర్వకంగానే విద్యారంగంపై పెట్టుబడి తగ్గించి..‘‘ప్రభుత్వం తిరిగి కొనసాగడానికి’’ ఓట్ల కోసం ప్రజాకర్షక పథకాలు పెడుతూ.. కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది. నెలనెలా కొత్త అప్పుల వేటలో ఉన్న ప్రభుత్వం.. ఉద్యోగుల జీతాలకు బాండ్ ల విక్రయానికి వెళ్తోంది. విద్యారంగ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలతో ఏ ఒక్క రోజుకూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన సందర్భాలు లేవు. 2018లో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి 3 గంటలు సమావేశం నిర్వహించి, గంటన్నర ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి18 అంశాలను అంగీకరించామని తెలిపారు. నాలుగేండ్లు గడిచినా వాటిలో ఏఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు.
హడావిడిగా మన ఊరు మన బడి
రాష్ట్ర ప్రభుత్వంఎవరితోను సంప్రదింపులు జరపకుండా హడావిడిగా ఏకపక్షంగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ పథకానికి రాష్ట్రంలో ఉన్న 26,050 బడుల్లో మూడోవంతు 9,125 పాఠశాలలను మొదటి దశగా ఎంపికచేసి చేసింది. రూ.7235 కోట్లతో 12 అంశాల్లో బడులను సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ఈ పథకానికి రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా నిధులు విడుదల చేయకుండా ఇతర శాఖల నుంచి నిధులు మళ్లించడమనేది ఈ పథకం డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పథకానికి నిధులు నేరుగా కేటాయించి, మొదటి దశ ఏ తేదీలోగా చేస్తారో డెడ్లైన్ప్రకటిస్తే విశ్వసనీయత పెరిగేది. రెండో దశ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. క్షేత్ర స్థాయిలో కేవలం అంచనాలకే పరిమితం అవుతోంది తప్ప పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఏ బడిలో కూడా భౌతిక వనరులు అభివృద్ధి జరిగినట్టు లేదు. పాత గోడలకు పూత వేసి ఇదే అభివృద్ధి అనే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి తీసుకు వస్తున్న విషయాన్ని ఇటీవల కొన్ని పాఠశాలలు సందర్శించగా కనిపించింది. ఈ విషయంలోనూ ఉపాధ్యాయ సంఘాలు బడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన బడ్జెట్ను తక్షణమే నేరుగా ఆయా పాఠశాలలకు విడుదల చేసి యుద్ధప్రాతిపదికన పాఠశాలలో గదుల నిర్మాణం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, కలర్ వేయటం, కంప్యూటర్ సౌకర్యాలు, ఫర్నిచర్ అన్నిరకాల పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అధికారుల, ప్రజాప్రతినిధుల హడావిడే తప్ప ఆచరణ అంతంత మాత్రమే.
పదోన్నతులు లేక పోస్టులన్నీ ఖాళీ..
రాష్ట్రంలో టీచర్లకు పదోన్నతులు లేకపోవడం వల్ల పైస్థాయి పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. సుమారు 8500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1956 పీజీ హెచ్ఎం పోస్టులు,10,446 పండిట్ పోస్టులు, 5,571 ఎస్ హెచ్ఎమ్ పోస్టులు,580 ఎంఈవో పోస్టులు,65 డీప్యూటీ డీఈవో పోస్టులు, డైట్ కాలేజీ, బీఎడ్ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీ కాకుండా కొన్నేళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఖాళీలు ఉన్నప్పుడు విద్యా రంగం ఎలా అభివృద్ధి జరుగుతుంది? విద్యలో నాణ్యత ఎలా పెరుగుతుంది? ఇప్పటికైనా పాలకులు ఈ విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. వసతులు కల్పించకుండా ఉపాధ్యాయుల కొరత తీర్చకుండా విద్యార్థుల్లో నైపుణ్యలు లేవని టీచర్లను తరచూ బద్నాం చేయడం పాలకులకు పరిపాటిగా మారింది. దీన్ని ఖండించడానికి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వెనక్కి తగ్గడం, ప్రభుత్వాలకు అండగా ఉండటం టీచర్లను మోసం చేయడమే అవుతుంది. లాబీయింగ్ లతో మౌలిక సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావనే సత్యాన్ని టీచర్ల సంఘాలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ ఎనిమిదేండ్లుగా లాబీయింగ్ చేసి సాధించిన సమస్య ఏ ఒక్కటి లేకపోగా ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసిన సందర్భం కనబడటం లేదు. ప్రభుత్వం ఏకీకృత సర్వీస్ రూల్స్ విడుదల చేసి టీచర్లకు పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే అందుకు గల ప్రధాన కారణం. ‘మన ఊరు..- మన బడి’ విజయవంతం కావాలన్నా, టీచర్ల బదిలీలు, పదోన్నతులు జరగాలన్నా, 317 ఉత్తర్వుల బాధిత టీచర్ల సమస్యలు తీరాలన్నా, బడ్జెట్లో విద్యకు నిధులు పెరగాలన్నా, టీచర్ల రిక్రూట్మెంట్ వేగంగా జరగాలన్నా, నాలుగేండ్లలో మూసివేసిన1202 బడులను తిరిగి తెరిపించాలన్నా.. సమష్టి పోరాటాలు
అనివార్యం.
ఇంగ్లిష్మీడియం బోధన..
ఈ విద్యాసంవత్సరంలో అన్ని బడుల్లో 1 నుంచి 8 వరకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెడుతున్నామని 2023-24 లో తొమ్మిదో తరగతి, 2024–-25లో పదో తరగతిలో ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి అధికారుల సమావేశంలో ప్రకటించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అనేది పూర్తి నైపుణ్యాలతో విద్యార్థులకు విద్యనందించాల్సిన విధానం. ఇఫ్లూ లాంటి విద్యా సంస్థల్లో టీచర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పిస్తే బాగుండేది. మౌలిక సదుపాయాల కల్పన కూడా అవసరం. ప్రతి పాఠశాలలో ప్రతి తరగతికి అదనపు తరగతి గది, అదనపు టీచర్అవసరం. టీచర్లను రిక్రూట్చేయకుండా, అదనపు గదులను నిర్మించకుండా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే ఎలా విజయవంతమవుతుందనే వివేచన లేకపోవడం శోచనీయం. టీచర్లకు కొన్ని రోజుల శిక్షణ ఇచ్చి.. అదీ కొన్ని రోజులు ఆన్లైన్ విధానంలోనే అందించి.. ఆంగ్ల మాధ్యమం విజయవంతం అవుతుందంటే తల్లిదండ్రులు ఎలా నమ్ముతారు?
- మైస శ్రీనివాసులు,
మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
టీపీటీఎఫ్